డీఎంకే హెల్ప్‌ డెస్క్‌ సేవలు | - | Sakshi
Sakshi News home page

డీఎంకే హెల్ప్‌ డెస్క్‌ సేవలు

May 3 2026 7:29 AM | Updated on May 3 2026 7:29 AM

● ప్రారంభించిన స్టాలిన్‌ ● నేతల భేటీ

సాక్షి, చైన్నె: కొత్తగా కళాశాలల్లో చేరే విద్యార్థులకు మార్గదర్శకత్వం అందించేందుకు , వారికి సహాయం చేసేందుకు డీఎంకే విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు హెల్ప్‌ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. దీనిని శనివారం అన్నా అరివాలయంలో డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్‌ ప్రారంభించారు. వివరాలు.. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు అవసరమైన సమాచారాన్ని అందించడమే లక్ష్యంగా ఈ హెల్ప్‌ డెస్క్‌ పనిచేయనుంది. దరఖాస్తులు నింపడం, సరైన కళాశాలను ఎంచుకోవడం ఉన్నత విద్యకు సంబంధించిన సలహాలు, సూచనలను ఈ కేంద్రం ద్వారా విద్యార్థులకు ఉచితంగా అందిస్తారు.

అందరికీ ఉపయోగపడేలా సేవలు

డీఎంకే విద్యార్థి విభాగం కార్యదర్శి వీరమణి జయకుమార్‌ మీడియాతో మాట్లాడారు. 2026–27 విద్యా సంవత్సరానికి గానూ డీఎంకే విద్యార్థి విభాగం తరఫున ఈ హెల్ప్‌డెస్క్‌ సేవలను ప్రారంభించామన్నారు. ప్లస్‌–2 పూర్తి చేసి కాలేజీల్లో చేరాలనుకునే విద్యార్థులకు తమిళ విద్యార్థి వేదిక ద్వారా అవసరమైన అన్ని మార్గదర్శకాలు అందుతాయన్నారు. విద్యార్థుల కోసం ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన నాన్‌ మొదల్వన్‌, తమిళ్‌ పుదల్వన్‌’ వంటి పథకాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి, వాటి ద్వారా వారు లబ్ధి పొందేలా సహాయం చేస్తామన్నారు. డీఎంకే విద్యార్థి విభాగం ఎంతో బలంగా ఉందని, ఎలాంటి పార్టీ వివక్ష లేకుండా విద్యార్థులందరికీ ఈ సేవలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. ఈ పనుల కోసం తమిళనాడు వ్యాప్తంగా 500 మంది విద్యార్థులను నియమించినట్లు ఆయన పేర్కొన్నారు.

సెల్వ పెరుంతొగై భేటీ

టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై స్టాలిన్‌తో సమావేశమయ్యారు. ఆయన ఒక్కరు మాత్రమే అన్నా అరివాయలయానికి వచ్చి స్టాలిన్‌ను కలవడం గమనార్హం. ఆయన్ని పదవి నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు ఏఐసీసీలో జరుగుతున్నట్టు, తనకు పదవి వద్దని సెల్వ పెరుంతొగై స్వచ్ఛందగా రాజీనామా చేసినట్టుగా సమాచారాలు వెలువడ్డ విషయం తెలిసిందే. ఈ పరిస్థితులలో కాంగ్రెస్‌ నాయకులు ఎవ్వరూ లేకుండా కేవలం సెల్వ పెరుంతొగై ఒక్కరే స్టాలిన్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొంగునాడు మక్కల్‌ దేశీయ కట్చి అధ్యక్షుడు కొంగు ఈశ్వరన్‌, పొల్లాచ్చి నియోజకవర్గ అభ్యర్థి నిత్యానందంతో కలిసి డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్‌ను కలిసి మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి కావాలని ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, డీఎంకే కూటమి విజయం ఖాయమని క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తున్నదన్నారు. అనేక ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను మించి డీఎంకే కూటమి మరిన్ని ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు. డీఎంకే పార్టీ సొంతంగా మెజారిటీతో వస్తుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement