పుదుచ్చేరి కిరీటం ఎవరికి? | - | Sakshi
Sakshi News home page

పుదుచ్చేరి కిరీటం ఎవరికి?

May 3 2026 7:29 AM | Updated on May 3 2026 7:29 AM

● మళ్లీ రంగస్వామికి సీఎం ఛాన్స్‌ దక్కేనా ● విజయ్‌ టీవీకేకు సైతం అవకాశం ● ఇండియా కూటమిలో అయోమయం

సాక్షి, చైన్నె : ఎప్పుడూ వేగంగా రాజకీయ సమీకరణాలు మారే పుదుచ్చేరిలో ఈసారి మళ్లీ ముఖ్యమంత్రి రంగస్వామి నేతృత్వంలోని ఎన్డీయే కూటమికే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. అదే సమయంలో ఇక్కడ విజయ్‌ టీవీకే ఓట్లు చీల్చేనా అన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే రంగన్న మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టకుండా బీజేపీ ఎలాంటి అడ్డంకులు సృష్టించేనో అన్న చర్చ ఊపందుకుంది. వివరాలు.. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మొత్తం 30 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ అధికారం చేపట్టేందుకు 16 స్థానాలు అవసరం. ఈసారి ఎన్డీయే కూటమి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోబోతోందని ప్రధాన సర్వేలు అంచనా వేస్తున్నాయి. యాక్సిస్‌ మై ఇండియా ఎన్‌డీఏ కూటమికి 16 – 20 , ఇండియా కూటమికి 6 – 8, విజయ్‌ టీవీకేకు 2 – 4, ఇతరులకు 1 – 3 సీట్లు వస్తాయని ప్రకటించాయి. అలాగే ప్రజాపోల్‌ ఎన్‌డీఏకు 19 – 25, ఇండియా కూటమికి 6 – 10 , పీపుల్స్‌ పల్స్‌ ఎన్‌డీఏకు 16 – 19, ఇండియా కూటమికి 10 – 12, విజయ్‌ టీవీకేకు 1, ఇతరులకు 1 – 2 వస్తాయని ప్రకటించారు. సంక్షేమ పథకాలను అమలు చేయడంలో, తన మాస్‌ రాజకీయంతో ప్రజల్ని ఆకర్షించడంలో సీఎం , ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత రంగస్వామి సఫలీ కృతులయ్యారు. అన్ని వయసుల వారిలో, ముఖ్యంగా మహిళలు , వయోజన ఓటర్లలో రంగస్వామిపై ఆదరణ చూపించారని సర్వేలు తేల్చాయి. ఇక, ఈ ఎన్నికల్లో అత్యంత ఆసక్తి రేకెత్తించిన అంశం నటుడు విజయ్‌ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం తొలి ఎన్నికల్లోనే ఒంటరిగా బరిలోకి దిగిన 1–4 స్థానాలు గెలుచుకోవచ్చు అని కొన్ని సర్వేలు తేల్చడం గమనార్హం.

రంగన్న సీఎం అయ్యేనా

గత 2021 ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 16 స్థానాలు గెలుచుకుని అధికారాన్ని దక్కించుకోగా, ఈసారి కూడా అదే జోరును కొనసాగించేలా కనిపిస్తున్నది. ఈ ఎన్నికల్లో రంగస్వామికి చెందిన ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ 16 స్థానాల్లో, బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేశాయి. ఇండియా కూటమిలో కాంగ్రెస్‌ 16 స్థానాల్లో, డీఎంకే 14 స్థానాల్లో బరిలోకి దిగాయి. పుదుచ్చేరిలో మరోసారి రంగస్వామి సారథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే, సీఎంగా రంగస్వామి కొనసాగేనా అన్న చర్చ తెర మీదకు వచ్చింది. ఎవరికి ఎన్ని సీట్లు అధికంగా వస్తాయో వారే సీఎం అభ్యర్థి అని, ఎవరు సీఎం సీటులో కూర్చోవాలో అన్నది కేంద్రం నిర్ణయిస్తుందని పదే పదే బీజేపీ స్థానిక నేతలు పేర్కొంటూ రావడం గమనార్హం. ఇక్కడ బీజేపీకి ముగ్గురు నామినేటెడ్‌ ఎమ్మెల్యే ఉండటం కలిసి వచ్చే అంశంగా మారింది. దీంతో సీఎం ఎవరు ఉంటారో? అన్న చర్చ ఇప్పడే ఊపందుకుంది. అదే సమయంలో రంగస్వామిని కాదని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరేదైనా వ్యూహ రచన చేసిన పక్షంలో పాత మిత్రుడైన డీఎంకేతో పాటుగా ఇతరులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్లాన్‌–బీని రంగన్న సిద్ధం చేసుకున్నట్టుగా ఇప్పటికే సంకేతాలు వెలువడటం గమనార్హం. సీఎం ఎవరన్నది పక్కన పెడితే, పుదుచ్చేరిలోనూ విజయ్‌ పాదం మోపడం, తన బలాన్ని చాటే విధంగా ఓట్లను చీల్చే అవకాశం ఉందని సర్వేలు పేర్కొంటుండటం ఆహ్వానించ దగిన విషయమే. ఇక ఈ ఎన్నికలలో వైద్యలింగం నేతృత్వంలో ఇండియా కూటమి ముందుకెళ్లినా, కాంగ్రెస్‌, డీఎంకే మధ్య సక్యత కొరవడటం మళ్లీ అధికారాన్ని ఈ కూటమి కోల్పోవాల్సిన పరిస్థితి రావడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement