సాక్షి, చైన్నె: వేసవి సెలవులలో ఆనందంగా గడిపేందుకు వెళ్లిన తమిళనాడుకు వారు మధ్య ప్రదేశ్‌లో మరణించిన సమాచారం తిరుచ్చి, కోయంబత్తూరులలోని బంధువులలో విషాదాన్ని నింపింది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఉన్న బర్గి డ్యామ్ వద్ద జరిగిన ఘోర పడవ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు తమిళులు జలసమాధి అయ్యారు. ఈ విషాద ఘటన తమిళనాడులోని తిరుచ్చి , కోయంబత్తూరు ప్రాంతాల్లో తీవ్ర శోకాన్ని నింపింది.
కోయంబత్తూరు వాసులు
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ తుపాకుల ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కామరాజ్ ఆహ్వానం మేరకు, కోయంబత్తూరుకు చెందిన అతని అన్నయ్య పరి మేళలగన్ తన భార్యాపిల్లలు వేసవి సెలవుల కోసం జబల్‌పూర్ పంపించాడు. తన తమ్ముడితో తన కుటుంబ సభ్యులంతా కలిసి బర్గి డ్యామ్‌ను సందర్శించేందుకు వెళ్లారు. డ్యామ్ అందాలను చూసేందుకు వీరంతా సుమారు 40 మంది పర్యాటకులతో కలిసి ఓ పడవ ఎక్కారు. పడవ ప్రయాణం మొదలైన మొదటి 300 మీటర్లు ఎంతో ఆహ్లాదకరంగా సాగింది. అయితే, అకస్మాత్తుగా సుడిగాలి తరహాలో వీచిన బలమైన గాలుల వల్ల పడవ ఒక్కసారిగా నీటిలో బోల్తా పడింది. పడవ బోల్తా పడటంతో అందులోని వారంతా నీటిలో పడిపోయారు. లైఫ్ జాకెట్లు ధరించిన వారు నీటిపై తేలుతూ ప్రాణాల కోసం పోరాడగా, జాకెట్లు సరిగ్గా లేని వారు , ధరించని వారు నెమ్మదిగా నీటిలో మునిగిపోయారు. ఈ ప్రమాదంలో కామరాజ్ (39) తిరుచ్చి జిల్లా నవలపట్టుకు చెందిన వ్యక్తి (మధ్యప్రదేశ్ ఫ్యాక్టరీ ఉద్యోగి), ఆయన భార్య కరుక్కాళి (38), ఆయన చిన్న కుమారుడు తమిళ్వేందన్ (5) మరణించారు. అలాగే, కామరాజర్ ఆహ్వానం మేరకు కోయంబత్తూరు నుంచి వెళ్లిన సోదరుడు పరి మేళలగన్ భార్య సౌభాగ్యవతి,ఆమె కుమారుడు మయూరన్(8) మరణించారు. కామరాజ్ పెద్దకుమారుడు పువి తరుణ్(11), సోదరుడు పరిమేళలగన్ కుమార్తె తమిళిని (7)ను రక్షించారు.
కన్నీరు మున్నీరైన ఐటీ ఉద్యోగి
కోయంబత్తూరులోని ఐటీ కంపెనీలో పనిచేస్తున్న పరిమేలళగన్, తన భార్యాపిల్లలు క్షేమంగా తిరిగి వస్తారని ఆశించాడు. కానీ భార్య , కుమారుడి మృతదేహాలను చూసి ఆయన కన్నీరు మున్నీరయ్యారు. ప్రాణాలతో బయటపడిన తన కుమార్తె తమిళినిని , సోదరుడి పెద్ద కుమారుడు పువితరణ్‌ను గుండెలకు హత్తుకుని రోదించిన తీరు అక్కడ ఉన్న వారిని కలిచివేసింది. ఈ ఇద్దరికీ పరిమేళలగన్ పెద్ద దిక్కు అయ్యాడు. వీరి మృత దేహాలను ఎయిర్ అంబులెన్స్ ద్వారా తమిళనాడులోని తిరుచ్చికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో ఇక్కడున్న ఆప్తులు, కుటుంబీకులు తీవ్ర శోకంలో మునిగారు.


