పర్యవేక్షకుల పరిశీలన
సాక్షి, చైన్నె: అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు 24 గంటలే సమయం ఉంది. దీంతో ఏర్పాట్లను వేగవంతం చేశారు. శనివారం ఏర్పాట్లను ప్రత్యేక పర్యవేక్షకులు, పోలీసు అధికారులు పరిశీలించారు. గత నెల 23వ తేదీన జరిగిన పోలింగ్‌లో రాష్ట్రవ్యాప్తంగా జరిగింది. 5.73 కోట్ల మంది ఓటర్లలో రికార్డు స్థాయిలో 85 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో యువత పెద్ద ఎత్తున తరలిరావడంతో ఓటింగ్ శాతం 90 శాతానికి పైగా నమోదైంది.
62 కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాటు:
రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 62 ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలన్నీ ప్రస్తుతం కేంద్ర భద్రతా దళాల పూర్తి ఆధీనంలో ఉన్నాయి. ఓటింగ్ యంత్రాలు, వీవీప్యాట్‌లను ఉంచిన 234 స్ట్రాంగ్ రూములకు 4 అంచెల పటిష్టమైన భద్రతను కల్పించారు. స్ట్రాంగ్ రూముల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నివారించడానికి సీసీటీవీ, టీవీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆయా కేంద్రాలలో నియోజకవర్గాల వారీగా కౌంటింగ్ ఏర్పాట్లు వేగవంతం చేశారు. అలాగే, ఎన్నికల ఫలితాల వేళ శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు తమిళనాడు పోలీస్ శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది పోలీసులను భద్రతా విధుల్లో నిమగ్నం చేశారు. చైన్నె నగరంలోనే 20,000 మంది పోలీసు అధికారులు నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. కాగా ఎన్నికల లెక్కింపు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగేలా చూసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం తమిళనాడులోని ఒక్కో నియోజకవర్గానికి ఒకరు చొప్పున 234 మంది రాష్ట్రేతర పరిశీలకులను నియమించింది. వీరందరూ శనివారం తమిళనాడుకు చేరుకుని భద్రతా ఏర్పాట్లను, లెక్కింపు సన్నాహాలను పర్యవేక్షించారు.


