సాక్షి, చైన్నె: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విడుదలకు సమయం ఆసన్నం అవుతోన్న సమయంలో వీసీకే నేత, ఎంపీ తిరుమావళవన్ శనివారం విడుదల చేసిన ఓ వీడియో సందేశం కొత్త చర్చకు దారి తీసింది. ఇందులో ఎన్నికల క్షేత్రంలో పార్టీ పనితీరు ఫలితాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అనేక నియోజకవర్గాలలో వీసీకే శ్రేణుల మధ్య ఐక్యత కొరవడిందన్న సమాచారాలు వేదన కలిగిస్తోందన్నారు.
కూటమి విజయం ఖాయం
ఆ వీడియోలో తిరుమావళవన్ స్పందిస్తూ..ఎన్నికల ఫలితాల కోసం అందరిలాగే తాము కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామన్నారు. వీసీకే పోటీ చేసిన స్థానాల్లోనే కాకుండా, భాగస్వాములుగా ఉన్న డీఎంకే నేతృత్వంలోని లౌకిక ప్రగతిశీల కూటమి అఖండ విజయం సాధిస్తుందనే నమ్మకం తనకు ఉందన్నారు. తాను సుమారు వీసీకే అభ్యర్థులతో పాటు, కూటమి పార్టీల అభ్యర్థుల తరఫున ఉదయం 9 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు విస్తృతంగా ప్రచారం చేశానని గుర్తు చేశారు. ఈ క్షేత్ర పర్యటనల్లో ప్రజలు డీఎంకె కూటమికి భారీగా మద్దతు ఇస్తున్నారనే నిజం స్పష్టంగా కనిపించిందన్నారు.
ఐక్యత ఏదీ
ఎన్నికల్లో వీసీకే శ్రేణులు అన్ని నియోజకవర్గాల్లో చాలా క్రమశిక్షణతో పని చేశారన్నారు. అయితే, కేవలం కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం నాయకులు, కార్యకర్తల మధ్య ఐక్యత లోపించినట్లు సమాచారం అందుతోందన్నారు. దీనిపై పార్టీ పరంగా అంతర్గత విచారణ, సమీక్ష జరుగుతోందన్నారు. ఏదేమైనప్పటికీ మిత్ర పక్ష అభ్యర్థులు కోసం పార్టీ శ్రేణులు చేసిన ఎన్నికల కృషి ఎంతగానో అభినందించ దగిన విషయంగా పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
త్వరలో సమీక్ష సమావేశం
తాజా ఎన్నికల సరళిపై చర్చించేందుకు , భవిష్యత్ కార్యాచరణను రూపొందించేందుకు త్వరలోనే జిల్లా కార్యదర్శుల సమావేశం, ఎన్నికల కార్యవర్గ కమిటీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తిరుమావళవన్ తన వీడియో సందేశంలో స్పష్టం చేశారు. తాము పోటీ చేసిన 8 స్థానాల్లోనూ వీసీకే తప్పకుండా విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా తిరుమా చేసిన వ్యాఖ్యలలో మిత్ర పక్షాల అభ్యర్థులు పోటీలో ఉన్న చోట్ల ఐక్యత కొరవడినట్టుగా వ్యాఖ్యలు చేయడం బట్టి చూస్తే, వీసీకే వర్గాలు కూటమి పార్టీలకు మద్దతుగా పనిచేసినట్టా? లేదా? లన్న చర్చ ఊపందుకుంది.


