వేలూరు: చిత్ర పౌర్ణమిని పురస్కరించుకుని వేలూరులో జలకంఠేశ్వరాలయం నుంచి వివిధ విద్యుత్ దీపాలంకరణ మధ్య శుక్రవారం రాత్రి ఏడు పుష్ప పల్లకీలతో కూడిన భవని వచ్చింది. ప్రతి సంవత్సరం చిత్ర పౌర్ణమి రోజున వేలూరులో వివిధ వ్యాపార సంఘాల ఆధ్వర్యంలో పుష్ప పల్లకీలు నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా వేలూరు కోట మైదానంలోని జలకంఠేశ్వరాలయం అద్వర్యంలో అకిలాండేశ్వరి సమేద జలకంఠేశ్వరుడి పుష్ప పల్లకీ, బియ్యం మండీ వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో సేన్‌బాక్కం సెల్వ వినాయకుడి పుష్ప పల్లకీ, బెల్లం మండీ వ్యాపారుల సంఘం నేతృత్వంలో తోటపాళ్యం తారకేశ్వరర్ పుష్ప పల్లకీ, వనిగర్ సంఘం ఆధ్వర్యంలో సుందర వినాయకుడి పుష్ప పల్లకీ, పూల మండీ వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో లక్ష్మి వినాయకుడి పుష్ప పల్లకీ సహా మొత్తం ఏడు పుష్ప పల్లకీలను కోట మైదానం వద్దకు తీసుకొచ్చి వివిధ విద్యుత్ దీపాలతో అలంకరించి పట్టణంలోని లాంగ్ బజారులో భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం పిల్టర్‌బెడ్ రోడ్డు, బజారు వీధి తదితర ప్రాంతాల్లో ఊరేగింపుగా తీసుకొచ్చి కోట మైదానం ఊరేగింపు చేరుకుంది. వీటిని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి దర్శించుకున్నారు. ఇదిలా ఉండగా రాత్రి 12 గంటల వరకు పట్టణంలో మూడు చోట్ల ఆర్‌కే స్ట్రా ఏర్పాటు చేసి భక్తులను ఆకట్టుకుంది.


