సాక్షి, చైన్నె: మే డే సందర్భంగా శుక్రవారం జరిగిన సభలో సీఎం ఎం.కె. స్టాలిన్ ప్రసంగించారు. తన పార్టీ శ్రేణులు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం మే 4న లభిస్తుందని, ఇందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
మే 4న విజయం ఖాయం
మేడే సందర్భంగా డీఎంకే నేతృత్వంలో సభ జరిగింది. ఇందులో స్టాలిన్ ప్రసంగిస్తూ , పార్టీ కార్యకర్తలు పడిన కష్టానికి తగిన ఫలితాన్ని ఈనెల 4వ తేదీన అందుకోబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఇందులో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. తాను ఈ మాటలను ఏదో ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా చెప్పడం లేదన్నారు. తన పార్టీ కార్యకర్తల కష్టాన్ని, వారి నిబద్ధతను నేను పూర్తిగా నమ్ముతున్నానని పేర్కొన్నారు.
మే డే చరిత్ర – ద్రావిడ ఉద్యమ నేపథ్యం
భారతదేశంలో మేడే వేడుకల ప్రాముఖ్యతను, తమ పార్టీకి ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా స్టాలిన్ గుర్తుచేసుకున్నారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మేడే వేడుకలను చైన్నెలోనే జరుపుకున్నారని గుర్తు చేశారు. అప్పట్లో సిందనై సెల్వన్ సింగారవేలర్ నాయకత్వంలో చైన్నెలో ఈ వేడుక మొదలైందన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సి.ఎన్.అన్నాదురై మే 1వ తేదీని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించారని గుర్తు చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన కరుణానిధి మేడేను జీతంతో కూడిన సెలవు దినంగా మార్చి చట్టం చేశారన్నారు.
జాతీయ స్థాయిలో గుర్తింపు
తమిళనాడులో మాత్రమే ఉన్న ఈ సెలవు దినాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కరుణానిధి పట్టుబట్టారని, నాటి ప్రధాని వి.పి.సింగ్ ఆ ప్రతిపాదనను అంగీకరించి, భారతదేశం అంతటా మే డేను జీతంతో కూడిన ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించారని స్టాలిన్ గుర్తుచేశారు. ప్రస్తుతం చైన్నెలో ఉన్న మే డే పార్కును, అక్కడ ఉన్న స్మారక చిహ్నాన్ని కూడా కరుణానిధే స్వయంగా పర్యవేక్షించి నిర్మించారన్నారు. కార్మికుల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం కరుణానిధి ఎంతటి నమ్మకంతో పనిచేశారో.. అదే నమ్మకాన్ని నిలబెడుతూ తన ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందన్నారు.
శుభవార్త అందుతుంది
రెండు రోజుల్లో వెలువడనున్న ఎన్నికల ఫలితాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న ప్రజలందరికీ మంచి వార్త అందుతుందనే నమ్మకం తనకు ఉందని ఆయన అన్నారు. ద్రావిడ మున్నేట్ర కజగం ప్రభుత్వం అందరికీ అన్నీ అనే సమ్మిళిత అభివృద్ధి సిద్ధాంతంపైనే పనిచేస్తున్నదన్నారు. భవిష్యత్తులోనూ ఇదే పాలన కొనసాగుతుందని స్పష్టం చేశారు.


