నీట్‌ విద్యార్థులకు హాల్‌ టికెట్లు | - | Sakshi
Sakshi News home page

నీట్‌ విద్యార్థులకు హాల్‌ టికెట్లు

May 2 2026 7:50 AM | Updated on May 2 2026 7:50 AM

తిరువళ్లూరు: నీట్‌ పరీక్షల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్‌ సెంటర్‌లో చదువుతున్న 50 మంది విద్యార్థులకు హాల్‌టికెట్లను కలెక్టర్‌ ప్రతాప్‌ ఽశుక్రవారం అందజేశారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 50 మంది విద్యార్థులను ఎంపిక చేసి వారికి ఉచిత నీట్‌ కోచింగ్‌తోపాటు ఉచిత భోజనం వసతులను ప్రభుత్వం కల్పించింది. ఇక్కడి విద్యార్థులకు హాల్‌టికెట్‌లను పంపిణీ చేసే కార్యక్రమం పట్టాభిరామ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ ప్రతాప్‌ హాజరై హాల్‌టికెట్‌లను పంపిణీ చేశారు. సీఈఓ కర్పగం, డీప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ పాండ్యన్‌ పాల్గొన్నారు.

కార్మికుల జెండా ఆవిష్కరణ

వేలూరు: వేలూరు ఉమ్మడి జిల్లాతో పాటు తిరువణ్ణామలై జిల్లాలో మే డే వేడుకలను కార్మిక నేతలు ఘనంగా నిర్వహించారు. వేలూరు సీఐటీయూ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి రామచంద్రన్‌ కార్మిక జెండా ఆవిష్కరించారు. అదేవిధంగా బస్సు ట్రాన్స్‌పోర్టు కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘం పరశురామన్‌ అల్లాపురంలోని బస్సు డిపో ఎదుట జెండాను ఎగురవేశారు. వేలూరు జిల్లా ఆటో కార్మికుల సంఘం ఆధ్వర్యంలో వసంతపురం నుంచి అన్నారోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం భవన నిర్మాణ కార్మికుల సంఘం అఖిల భారత అధ్యక్షుడు ఆర్‌టీ పయణి అధ్యక్షతన మండీ వీధి, సంఘ కార్యాలయం ఎదుట జెండాను ఎగురవేశారు.

తిరుచెందూర్‌ హుండీ ఆదాయం రూ. 3.95 కోట్లు

అన్నానగర్‌: తిరుచెందూర్‌ సుబ్రహ్మణ్యస్వామి హుండీ ఆదాయం రూ.3.95కోట్లు లభించిందని ఆలయ అధికారులు తెలిపారు. ఆలయంలో ప్రతి నెలా భక్తులు సమర్పించిన హుండీ కానుకలను లెక్కిస్తారు. ఈ నేపథ్యంలో, గురువారం ఆలయ ప్రాంగణంలో కానుకలను సిబ్బంది లెక్కించారు. లెక్కింపులో రూ.3.95 కోట్ల నగదు, 803 గ్రాముల బంగారం, 17 కిలోల 765 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీని భక్తులు కానుకలుగా సమర్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

ఇరుళ కుటుంబీకులకు పక్కా ఇళ్లు

తిరుత్తణి: తిరుత్తణి సమీపంలో నిరుపేద ఇరుళ కుటుంబీకులకు 15 పక్కా ఇళ్లు నిర్మించి అర్హులకు శుక్రవారం అప్పగించారు. తిరుత్తణి యూనియన్‌లోని బీరకుప్పం పంచాయతీలోని కొండ ప్రాంతంలో కనీస సదుపాయాలు లేకుండా 15 ఇరుల కుటుంబీకులు చీకటి బతుకులు పట్ల తెలుసుకున్న తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్‌ వారితో రాత్రంతా గడిపి వారి కష్టాలు తెలుసుకున్నారు. వారికి కనీస సదుపాయాలు కల్పించాలనే ఆశయంతో పంచాయతీరాజ్‌ నిధుల నుంచి రూ.18 లక్షలతో విద్యుత్‌, తాగునీరు, రోడ్లు, మురుగునీటి కాలువలు నిర్మించారు. దీంతో పాటు పక్కా ఇళ్లు నిర్మాణం కోసం మద్రాస్‌ రోటరీ క్లబ్‌ సంయుక్త సహకారంతో ప్రయివేటు సంస్థ ముందుకొచ్చి రూ.1.05 కోట్ల వ్యయంతో 15 పక్కా ఇళ్లు నిర్మించారు., ఎయిడ్‌ ఇండియా సంస్థ సమక్షంలో ఈ పనులు పూర్తి చేశారు. చీకటి గ్రామంలో వెలుగులు నింపి కనీస సదుపాయాలు పక్కా ఇళ్లు నిర్మించారు. శుక్రవారం నూతన ఇళ్లు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే చంద్రన్‌, రోటరీ క్లబ్‌ శ్రేణులు, ఎయిడ్‌ ఇండియా సంస్థ ప్రతినిధులు పాల్గొని కొత్త ఇళ్లు లబ్ధిదారులకు అందజేశారు. చీకటి అలుముకున్న తమ బతుకుల్లో వెలుగులు నింపిన ఎమ్మెల్యే చంద్రన్‌, స్వచ్ఛంధ సంస్థల నిర్వాహకులకు ఇరుళ కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు.

బైక్‌ అదుపుతప్పి ఎస్‌ఐ మృతి

అన్నానగర్‌: బైక్‌ అదుపుతప్పి ఓ ఎస్‌ఐ మృతిచెందాడు. మదురై దక్షిణ, ఉత్తర నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని మదురైలోని తిరుపరంకుండ్రం త్యాగరాజర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేశారు. గురువారం, మదురై తిలగర్‌ దిడల్‌ పోలీస్‌ ఎస్‌ఐ బాలమురుగన్‌ భద్రతా కారణాల దృష్ట్యా బైక్‌లో లెక్కింపు కేంద్రానికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన ప్రయాణిస్తున్న బైక్‌ అదుపుతప్పి కళాశాల ప్రవేశ ద్వారాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో బాలమురుగన్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement