భక్తజన సాగరంలో వైగై నదీ తీరం | - | Sakshi
Sakshi News home page

భక్తజన సాగరంలో వైగై నదీ తీరం

May 2 2026 7:50 AM | Updated on May 2 2026 7:50 AM

మీనాక్షి అమ్మవారి సన్నిధిలో మహోత్సవం ముగింపునకు ఒక రోజు ముందుగా అళగర్‌మలైలలో కళ్లలగర్‌ సన్నిధిలో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ ఉత్సవంలో భాగంగా వైగై నదీ ప్రవేశాన్ని కనులార తిలకించేందుకు భక్త కోటి గురువారం రాత్రి నుంచే మదురైకు పోటెత్తారు. దీంతో మదురై నగరం రాత్రంతా భక్త జన సందోహంలో మునిగింది. గోవింద నామ స్మరణతో నగరం పులకించింది. తేనూర్‌ నుంచి బంగారు పల్లకిలో మదురైకు చేరుకున్న కళ్లలగర్‌కు గురువారం రాత్రంతా ప్రత్యేక పూజలు జరిగాయి. శుక్రవారం వేకువజామున పూజాది కార్యక్రమాలు ముగించుకున్న కళ్లలగర్‌ స్వామి సరిగ్గా 2.30 గంటలకు బంగారు అశ్వవాహనాన్ని అధిరోహించారు. శ్రీవిల్లి పుత్తూరు అండాల్‌ ఆలయం నుంచి ప్రత్యేకంగా సిద్ధం చేసి తీసుకొచ్చిన పూల మాలను ధరించి వైగై నదీ వైపు కదిలారు. పచ్చ వర్ణ పట్టు వస్త్రాలను ధరించి స్వామి ముందుకు సాగుతుంటే, లక్షలాది మంది భక్తులు స్వామి వారిని తనివి తీరా దర్శించుకునేందుకు ఎగబడ్డారు. పలు మార్గాల గుండా ప్రయాణించిన స్వామి వారికి సరిగ్గా 4 గంటల సమయంలో ఆహ్వానం పలుకుతూ ఎలుత్తాణికార వీధిలో వెండి అశ్వవాహనంలో వచ్చిన వీరరాఘవ పెరుమాల్‌ ఎదురుగా వచ్చారు. అక్కడి నుంచి సరిగ్గా 4.42 గంటలకు ఆళ్వార్‌పురం చేరుకున్న స్వామి వారు అనంతరం వైగై నదీ ప్రవేశం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement