వైభవంగా ధ్వజారోహణం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా ధ్వజారోహణం

May 2 2026 7:50 AM | Updated on May 2 2026 7:50 AM

సాక్షి, చైన్నె: 108 దివ్య దేశాలలో ఒకటైన చైన్నెలోని ట్రిప్లికేన్‌ పార్థసారథి స్వామి ఆలయంలో చిత్తిరై బ్రహ్మోత్సవాలు శుక్రవారం ధ్వజారోహణంతో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు ఈనెల 10వ తేదీ వరకు పది రోజులపాటు కను ల పండువగా జరగనున్నాయి. ఈ ప్రసిద్ధ ఆలయంలో శ్రీవేంకటకృష్ణుడు (పార్థసారథి), రంగనాథుడు, నరసింహస్వామి, గజేంద్ర వరదరాజ పెరుమాళ్‌, కోదండరామ స్వామిలకు వేర్వేరు సన్నిధులు ఉన్నాయి. చిత్తిరై బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు గతనెల 29వ తేదీ రాత్రి అంకురార్పణం, 30వ తేదీన పుష్పపల్లకి సేవలు జరిగాయి. శుక్రవారం వేకువజాము నుంచి ఆలయంలో విశిష్ట పూజలు జరిగాయి. 4 గంటల నుండి 5 గంటల మధ్య కన్యా లగ్నంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్వామి వారిని తిరు వీధులలో ఊరేగించారు. భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు పలికారు.

వాహన సేవలు

చైన్నె నగరంలో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో పది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామివారు వివిధ వాహనాలపై తిరువీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఆదివారం స్వామివారి గరుడ సేవ ఉత్సవం కనుల పండువగా జరుగుతుంది. ఈనెల 5వ తేదీన మంగళవారం ఉదయం 8.30 గంటలకు పల్లకి నాచ్చియార్‌ తిరుక్కోలం హనుమంత వాహన సేవతో పాటుగా అదే రోజు రాత్రి గజ వాహన సేవ జరుగుతంది. ఈనెల 7వ తేదీన శ్రీ పార్థసారథి స్వామి తిరుతేర్‌ (మహారథోత్సవం) నిర్వహించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement