సాక్షి, చైన్నె: విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా విద్యతోపాటు మానవత్వాన్ని కూడా అలవరుచుకోవాలని తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అన్నారు. నీలగిరి జిల్లా ఊటీ లవ్‌డేల్‌లోని ప్రసిద్ధ లారెన్స్ పాఠశాల 168వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలలో శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గవర్నర్ బహుమతులు అందజేసి ప్రసంగించారు.
జాతీయ విద్యా విధానం
దేశంలో నూతన జాతీయ విద్యా విధానం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో లారెన్స్ వంటి విద్యాసంస్థలు అద్భుతమైన పాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు. విద్యా రంగంలో రాణించే వారిని ప్రోత్సహించాలని, వారి విజయం మొత్తం విద్యా వ్యవస్థ సాధించిన విజయమని వివరించారు.
దేశ సేవ ముఖ్యం
నేటి సమాజంలో విద్యార్థులు కేవలం అధిక మార్కు లు సాధించాలనే ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అయితే యువత చదువుతోపాటు మానవతా విలువలను పెంపొందించుకోవాలని, చదువు పూర్తయిన తర్వాత సమాజానికి, దేశానికి సేవ చేసే మనస్తత్వాన్ని కలిగి ఉండడం చాలా ముఖ్యమని పిలుపునిచ్చారు. ఐఐటీ, ఐఐఎం వంటి ఉన్నత విద్యా అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని గవర్నర్ సూచించారు. కేవలం ఉద్యోగాలు వెతికే వారిలా కాకుండా, పది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. పాఠశాలలు, కళాశాలల్లో వ్యవస్థాపక అభివృద్ధి విభాగాలను ఏర్పాటు చేయడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. విద్యార్థులు చిన్న వయస్సు నుంచే సరికొత్త ఆలోచనలను, సృజనాత్మకతను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. పాఠశాల హెచ్‌ఎం డి.వి.ఎస్. రావు, పాఠశాల పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు ఉపాధ్యాయులుపాల్గొన్నారు.


