వేలూరు: చిత్ర పౌర్ణమిని పురస్కరించుకుని తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ గిరివలయం రోడ్డు గురువారం రాత్రి పూర్తిగా భక్తులతో కిటకిటలాడింది. ఎటు చూసినా భక్త జనమే, ఎటు విన్నా హరోం హరా నామస్మరణమే వినిపించింది. గురువారం నుంచి శుక్రవారం రాత్రి వరకు గిరివలయం చుట్టి వచ్చి ఐదు గంటల పాటు క్యూలో వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు. 20 లక్షలకు పైగా భక్తులు తిరువణ్ణామలై చేరుకోవడంతో భక్తులతో కిటకిటలాడింది. మాడ వీధుల్లో స్వామి వారికి భక్తులు కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఎస్పీ సుధాకర్ అద్వర్యంలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు, బస్సులను ఏర్పాటు చేశారు. 16 ప్రాంతాల్లో తాత్కాలిక బస్టాండ్‌లు ఏర్పాటు చేశారు. అదే విధంగా 87 ప్రాంతాల్లో కారు పార్కింగ్ వసతి ఏర్పాటు చేశారు. స్వామి వారి దర్శనార్థం తిరువణ్ణామలైకి వచ్చిన భక్తుకలు గిరివలయం రోడ్డుతో పాటు ఆలయ ప్రాంగణం, అష్టలింగం ఆలయం ప్రాంతాల్లో దాతలతో పాటు ఆలయ నిర్వాహకులు, మజ్జిగ, నీరు, శీతల పానియాలను అందజేశారు.


