సాక్షి, చైన్నె: కొడైకెనాల్‌లోని అటవీ శాఖ నియంత్రణలో ఉన్న అన్ని పర్యాటక ప్రాంతాలను రెండు రోజుల పాటుగా పర్యాటకులు ఎలాంటి ప్రవేశ రుసుము లేకుండా ఉచితంగా సందర్శించవచ్చని దిండిగల్ జిల్లా కలెక్టర్ శరవణన్ ప్రకటించారు.
ఉచిత సందర్శనకు దారితీసిన కారణం
దిండిగల్ జిల్లాలోని ప్రముఖ హిల్ స్టేషన్ కొడైకెనాల్‌లో పర్యాటక ప్రాంతాల సందర్శన కోసం అటవీ శాఖ ఇటీవల క్యూఆర్ కోడ్ ద్వారా ఒకే చోట ప్రవేశ రుసుము వసూలు చేసే విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ విధానంతో గ్రీన్ వ్యాలీ పరిసర ప్రాంతాల్లో గంటల కొద్దీ తీవ్ర ట్రాఫిక్ జామ్ శుక్రవారం ఏర్పడింది. క్యూఆర్ కోడ్ విధానానికి నిరసనగా, పాత పద్ధతిలోనే ఏ పర్యాటక ప్రాంతానికి అక్కడ విడివిడిగా టిక్కెట్లు వసూలు చేయాలని డిమాండ్ చేస్తూ కొడైకెనాల్ టూరిస్ట్‌లు, వాహన డ్రైవర్లు ఈరోజుఉదయం నుంచి ఆందోళనకు దిగారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగాయి. పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శుక్రవారం పర్యాటకులు ఎక్కడకు వెళ్ల కుండా హోటళ్లు, రిసార్టులకు పరిమితం అయ్యారు. దీంతో సమస్యపై దిండిగల్ జిల్లా కలెక్టర్ శరవణన్ స్పందిస్తూ పర్యాటకుల సౌకర్యార్థం కీలక నిర్ణయాలు ప్రకటించారు. కొడైకెనాల్‌కు వస్తున్న పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శని, ఆదివారం రెండు రోజులపాటు అటవీ శాఖ ఆధ్వర్యంలోని అన్ని పర్యాటక ప్రాంతాలను ఉచితంగా సందర్శించవచ్చు. ఎటువంటి టికెట్ తీసుకోనవసరం లేదని ప్రకటించారు. క్యూఆర్ కోడ్ ద్వారా ఎలాంటి క్యూ లైన్లు లేకుండా పర్యాటకులు తక్షణమే టిక్కెట్లు పొందే కొత్త డిజిటల్ విధానం మే 4వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో అమలులోకి వస్తుందని కలెక్టర్ తెలిపారు.


