సాక్షి, చైన్నె: ఇంటి బయట ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల బాలికను అపహరించి లైంగిక దాడి చేసి హతమార్చిన కేసులో నిందితుడు కరుణాష్‌ను కోర్టు గురువారం దోషిగా తేల్చింది. 2024 మార్చి 2వ తేదీన పుదుచ్చేరి ముత్తియాల్‌పేట ప్రాంతానికి చెందిన 5వ తరగతి చదువుతున్న 9 ఏళ్ల బాలిక ఇంటి వద్ద ఆడుకుంటూ అదృశ్యమైంది. మార్చి 4వ తేదీ రెండు రోజుల తర్వాత, బాలిక మృతదేహం ఇంటి సమీపంలోని ఒక కాలువలో లభ్యమైంది. బాలిక కాళ్లు, చేతులు కట్టేసి, ఒక దుప్పటిలో చుట్టి పడేసి ఉన్న స్థితిలో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో ఈ ఘటన పెద్ద కలకలం రేపింది. ఈ కేసులో అదే ప్రాంతానికి చెందిన కరుణాస్ (19) ,వివేకానందన్(59)ను పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరైన వివేకానందన్ అదే ఏడాది సెప్టెంబర్ లో జైలులోని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కరుణాస్‌పై లైంగిక దాడి, కిడ్నాప్, హత్య, ఆధారాల విధ్వంసం వంటి సెక్షన్ల కింద పోలీసులు 540 పేజీల చార్జ్ షీట్ దాఖలు చేశారు. పోక్సో కోర్టు న్యాయమూర్తి సుమతి గురువారం తుది తీర్పునిస్తూ కరుణాస్‌ను దోషిగా ప్రకటించారు. నిందితుడికి ఎలాంటి శిక్ష విధించాలనే అంశంపై మే 5వ తేదీన ప్రకటిస్తామన్నారు. నిందితుడికి మరణశిక్ష విధించాలని ప్రభుత్వ న్యాయవాది పచ్చయప్పన్ కోర్టును కోరారు.
నిందితుడు కరుణాస్


