అన్నానగర్: దైవ దర్శనానికి వెళుతూ కారు బోల్తాపడిన ఘటనో ఓ బాలిక మృతిచెందింది. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. చెంగల్పట్టు జిల్లాలోని తలంబూర్ స్మార్ట్ టౌన్ ప్రాంతానికి చెందిన రాజతిలక్ (37) గురువారం ఉదయ కుటుంబంతో కలిసి పళని మురుగన్ ఆలయానికి కారులో బయలుదేరాడు. దిండుక్కల్– తిరుచ్చి జాతీయ రహదారిపై వడమదురై సమీపంలోని కొప్పంపట్టి వద్ద వెళుతుండగా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈప్రమాదంలో కారులో ఉన్న రాజతిలక్, అతని తండ్రి మురుగన్ (61), తల్లి సెన్బగవల్లి (58), భార్య తమిళసెల్వి (35), కుమార్తెలు వర్ణాసాసీ (11), ఆధ్యసాన్వి (7) తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే గాయపడ్డ వారిని దిండుక్కల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలిక ఆధ్యసాన్వి మార్గమధ్యంలోనే మృతిచెందింది. పోలిసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తిరువళ్లూరు: వైద్యవీరరాఘవుడి ఆలయంలో జరుగుతున్న చైత్రమాసం బ్రహ్మోత్సవాల సందర్భంగా తొమ్మిదవ రోజు గురువారం ఉదయం స్వామివారికి తీర్థవారి నిర్వహించారు. తిరువళ్లూరులోని శ్రీవైద్యవీరరాఘవుడి ఆలయంలో ప్రతి ఏటా చైత్రమాసంలో పది రోజులపాటు బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా తొమ్మిదవ రోజు ఉదయం స్వామి వారికి ఆలయ పుష్కరిణిలో తీర్థవారి నిర్వహించారు. అనంతరం వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం రాత్రి ఏడు గంటలకు విజయకోటి విమానసేవను కనుల పండువగా నిర్వహించారు.
తిరువొత్తియూరు: చెంగల్పట్టు సమీపంలోని విలంగడుపాక్కం ప్రాంతానికి చెందిన పరందామన్(53) మేసీ్త్రగా పనిచేసేవాడు. ఇతనికి భార్య సెల్వి, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పరందామన్‌కు మద్యంతాగే అలవాటు ఉండటంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. బుధవారం కూడా దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో సెల్వి తన పిల్లలతో కలిసి సమీపంలోని తన తల్లి ఇంటికి వెళ్లిపోయింది. రాత్రి సమయంలో పరందామన్ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో పరం దామన్ ఇంటికి అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఇంట్లోని గ్యాస్ సిలిండర్ కూడా పేలడంతో మంటలు తీవ్రమయ్యాయి. బయటకు రాలేక పరందామన్ ఇంట్లోనే చిక్కుకుని సజీవ దహనమయ్యాడు. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తమిళసినిమా: విక్రమ్ కథానాయకుడుగా నటించిన చిత్రం ధ్రువ నక్షత్రం.నటి నీతు వర్మ నాయకగా నటించిన ఇందులో సిమ్రాన్, రాధిక శరత్ కుమార్, పార్తీపన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2017లో ప్రారంభమయింది. 2018 లో విడుదల చేయడానికి ప్రణాళికలన సిద్దం చేశారు. అయితే కొన్ని ఆర్థిక సమస్యల కారణంగా చిత్రం అనుకున్న ప్రకారం విడుదల కాలేదు. దర్శకుడు గౌతమ్ మేనన్ పలు విధాలుగా ప్రయత్నాలు చేసి 2023లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు అయితే అప్పుడు కూడా పలు ఆటంకాలు ఎదురయ్యాయి కాగా ఇటీవల సమస్యలు పరిష్కారం అవుతున్నాయని మరో రెండు వారాల్లో దవనక్షత్రం చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు ఇలాంటి పరిస్థితుల్లో ధ్రువ నక్షత్రం చిత్ర విడుదలపై నిషేధం విధించాలన్న పిటిషన్ గురువారం విచారించిన చైన్నె హైకోర్టు చిత్రాన్ని జూన్ 15వ తేదీని విడుదలకు అనుమతిని ఇస్తూ కొన్ని నిబంధనను విధించింది. ఈ చిత్రం వసూళ్ల వివరాలను తెలిపే విధంగా ప్రత్యేకంగా బ్యాంకులో ఖాతాను ప్రారంభించాలని అందులో చిత్ర ఆదాయ వ్యయ వివరాలను పొందుపరచడానికి ఒక వ్యక్తిని నియమించాలని, ఆ చిత్ర వసూళ్లను ఎవరు ఖర్చు చేయరాదని, అదేవిధంగా చిత్ర దర్శకుడు గౌతమ్ మేనన్ ,సహ నిర్మాతలు విడుదల చేయడానికి కావలసిన డబ్బులు ఇంతకుముందే ఆయన డాక్యుమెంట్స్ కుదవ పెట్టిన వారి నుంచి మరికొంత డబ్బు పొందాల్సి అవసరం ఉంటుందని పేర్కొన్నారు. అదేవిధంగా చిత్రాన్ని విడుదల చేసే ముందు డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమాన్యంతో చర్చించాలని పేర్కొన్నారు. అదేవిధంగా ఒకవేళ చిత్రాన్ని జూన్ 15వ తేదీ విడుదల చేయలేకపోతే ఆ కారణాలను న్యాయస్థానానికి వివరించాల్సి ఉంటుందని న్యాయమూర్తి పేర్కొన్నారు.


