ఘనంగా ఐఐటీ మద్రాస్‌ 67వ ఇన్‌స్టిట్యూట్‌ డే | - | Sakshi
Sakshi News home page

ఘనంగా ఐఐటీ మద్రాస్‌ 67వ ఇన్‌స్టిట్యూట్‌ డే

May 1 2026 5:51 AM | Updated on May 1 2026 5:51 AM

● అత్యుత్తమ పురస్కారాల ప్రదానం

సాక్షి, చైన్నె: ప్రతిష్టాత్మక ఐఐటీ మద్రాస్‌ 67వ ఇన్‌స్టిట్యూట్‌ డే వేడుకలు గురువారం క్యాంపస్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు డాక్టర్‌ వి. అనంత నాగేశ్వరన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సాంకేతికత, ప్రతిభ , భారతదేశ ట్రిలియన్‌ డాలర్ల లక్ష్యం అనే అంశంపై ప్రసంగించారు. ప్రస్తుతం దేశ జీడీపీ దాదాపు 3.91 ట్రిలియన్‌ డాలర్లుగా ఉందని, రాబోయే ఆరేళ్లలో ఇది 7.8 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని డాక్టర్‌ నాగేశ్వరన్‌ ధీమా వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర శతాబ్ది వేడుకల నాటికి (2047) భారతదేశాన్ని 30 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

సాంకేతికత ప్రాధాన్యత

లక్ష్యాలను సాధించాలంటే భారతదేశం సొంతంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, ప్రపంచం సాంకేతికతను ఉచితంగా ఇవ్వదని ఆయన స్పష్టం చేశారు. ఐఐటీల వంటి సంస్థలు అంతర్జాతీయ స్థాయి పరిశోధనలకు వేదిక కావాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో భాగంగా వివిధ రంగాల్లో రాణించిన ఐఐటీ మద్రాస్‌ పూర్వ విద్యార్థులకు ప్రతిష్టాత్మక అవార్డులను అందజేశారు. విశిష్ట పూర్వ విద్యార్థుల పురస్కారాలు ఓపెన్‌ ఏఐ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ శ్రీనివాస్‌ నారాయణన్‌, హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ సీఎండీ డాక్టర్‌ డి.కె. సునీల్‌, గోల్డ్‌మన్‌ శాక్స్‌ గ్లోబల్‌ కో–హెడ్‌ మహేశ్వర్‌ సైరెడ్డి సహా 11 మందికి ఈ పురస్కారాలు లభించాయి. అలాగే యంగ్‌ అలమ్నీ అచీవర్‌ అవార్డులు పెర్‌ప్లెక్సిటీ . ఏఐ కో–ఫౌండర్‌ , సీఈఓ డాక్టర్‌ అరవింద్‌ శ్రీనివాస్‌, డార్విబాక్స్‌ సీఈఓ జయంతి పాలేటి, గూగుల్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ డాక్టర్‌ సువినయ్‌ సుబ్రమణియన్‌ అందుకున్నారు.

ఐఐటీ మద్రాస్‌ రికార్డులు..

ఐఐటీ మద్రాస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వి. కామకోటి మాట్లాడుతూ.. వరుసగా ఏడవ ఏడాది ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో శ్రీఓవరాల్‌శ్రీ కేటగిరీలో నంబర్‌ 1 స్థానాన్ని, ఇంజినీరింగ్‌ విభాగంలో వరుసగా పదవ ఏడాది ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. అలాగే ఐఐటీ మద్రాస్‌ను ప్రపంచంలోనే మొట్టమొదటి మల్టీ నేషనల్‌ యూనివర్సిటీగా మార్చేందుకు ఐఐటీఎం గ్లోబల్‌ను ప్రారంభించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అత్యుత్తమ బోధన కనబరిచిన ప్రొఫెసర్లు, పరిశోధకులు, సిబ్బందికి కూడా వివిధ పురస్కారాలను అందజేసి సత్కరించారు.

Advertisement
 
Advertisement
Advertisement