సాక్షి, చైన్నె: ఓట్ల లెక్కింపు సమయంలో అనధికార వ్యక్తులు కౌంటింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించకుండా అడ్డుకోవడానికి ఎన్నికల కమిషన్ వినూత్నమైన క్యూఆర్ కోడ్ ఆధారిత ఫొటో గుర్తింపు కార్డుల విధానాన్ని ప్రవేశపెట్టింది. మే 04న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నుండి ఈ విధానం అమలులోకి తీసుకొస్తూ న్ణియించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద గుర్తింపును ధృవీకరించడానికి మూడు అంచెల భద్రతా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నారు. మొదటి, రెండవ అంచెల్లో రిటర్నింగ్ అధికారి జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డులను మాన్యువల్‌గా తనిఖీ చేస్తారు. మూడవ అంచె (కౌంటింగ్ హాల్ దగ్గర) వద్ద కేవలం క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా ధృవీకరణ పూర్తయ్యాక మాత్రమే లోపలికి అనుమతించేందుకు చర్యలు తీసుకున్నారు. రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, లెక్కింపు సిబ్బంది, టెక్నికల్ సిబ్బంది, అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు , కౌంటింగ్ ఏజెంట్లకు ఈ క్యూఆర్ కోడ్ కార్డులు తప్పనిసరి చేశారు. ఇక మీడియా ప్రతినిధుల కోసం ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల సంఘం జారీ చేసిన అధికార పత్రాల ఆధారంగానే వారికి ప్రవేశం కల్పిస్తారు.
పారదర్శకత కోసమే..
గత ఏడాది కాలంగా ఎన్నికల సంఘం చేపట్టిన 30కి పైగా సంస్కరణల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అత్యున్నత స్థాయి భద్రత, పారదర్శకత , సమర్థతను నిర్ధారించడానికి ఈ డిజిటల్ విధానం దోహదపడుతుందని ఎన్నికల సంఘం డిప్యూటీ డైరెక్టర్ పి. పవన్ పేర్కొన్నారు.
ఓట్ల లెక్కింపు పర్యవేక్షణ
తమిళనాడు వ్యాప్తంగా 62 కౌంటింగ్ కేంద్రాలలో ఎన్నికల కమిషన్ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేసింది. ఈ ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు ప్రతి నియోజకవర్గానికి ఒకరు చొప్పున మొత్తం 234 మంది ఇతర రాష్ట్రాల ఐఏఎస్ అధికారులను పరిశీలకులుగా నియమించారు. లెక్కింపు ప్రక్రియలో పారదర్శకతను పెంచడానికి తమిళనాడు వెలుపలి రాష్ట్రాల నుండి వచ్చిన ఐఏఎస్ అధికారులు ప్రతి టేబుల్ వద్ద జరిగే లెక్కింపును పర్యవేక్షిస్తారు. ఏదైనా రౌండ్ ఫలితాన్ని అధికారికంగా ప్రకటించాలన్నా లేదా అత్యవసర పరిస్థితుల్లో కీలక నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ పరిశీలకుల ఆమోదం , సంతకం తప్పనిసరి కానుంది. కాగా, ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్ష మంది సిబ్బందిని నియమించారు. వీరికి ఇప్పటికే శిక్షణ ముగించారు. పెద్ద నియోజకవర్గాల్లో లెక్కింపు ఆలస్యం కాకుండా అదనపు టేబుళ్లను కూడా ఏర్పాటు చే యడానికి చర్యలు తీసుకున్నారు.
భారీ భద్రత
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు భిన్నంగా ఉండటంతో, లెక్కింపు రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం , రాష్ట్ర పోలీసులు అత్యంత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్ష మందిని భద్రతా విధులలోకి పోలీసులను నియమించారు. రాజధాని చైన్నెలో భద్రత కోసం 20,000 మంది పోలీసులను కేటాయించారు. 62 లెక్కింపు కేంద్రాల వద్ద కేంద్ర పారామిలిటరీ బలగాలు నిరంతరం పర్యవేక్షణలో ఉన్నాయి.


