కిటకిటలాడిన గిరివలయం | - | Sakshi
Sakshi News home page

కిటకిటలాడిన గిరివలయం

May 1 2026 5:51 AM | Updated on May 1 2026 5:51 AM

వేలూరు: చిత్ర పౌర్ణమిని పురష్కరించుకొని తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ గిరివలయం రోడ్డు భక్తులతో కిటకిటలాడింది. ఈఏడాది చిత్ర పౌర్ణమి గురువారం రాత్రి 9.52 గంటలకు ప్రారంభమై శుక్రవారం రాత్రి 11.08 గంటలకు ముగుస్తుంది. కార్తీక దీపం తరహాలోనే చిత్ర పౌర్ణమికి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తారని ఆలయ జాయింట్‌ కమిషనర్‌ భరణీధరన్‌ ఆధ్వర్యంలో భక్తులకు అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేశారు. అదేవిధంగా ఆలయంలోని అన్నామలైయార్‌ సమేత ఉన్నామలై అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి పుష్పాలంకరణలు చేశారు. ఇదిలాఉండగా చిత్ర పౌర్ణమి సమయంలో గిరివలయం రోడ్డులో కాలి నడకన వచ్చి స్వామి వారిని దర్శించుకుంటే పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. అందులో బాగంగా 15 లక్షలకు పైగా భక్తులు తిరువణ్ణామలై చేరుకున్నారు. అనంతరం గిరివలయం వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో గురువారం రాత్రి తిరువణ్ణామలైలో ఎటు చూసినా భక్తులతో కిటకిటలాడింది. అదేవిధంగా భక్తులు ఆలయంలోను బారులు తీరి స్వామి వారిని దర్శించుకున్నారు. మాడ వీధుల్లో స్వామివారికి భక్తులు అధిక సంఖ్యలో కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా భక్తులు ఎలాంటి తొక్కిసలాట లేకుండా ఎస్పీ డాక్టర్‌ సుధాకర్‌ అధ్యక్షతన ఐదు వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలో పది రోజులు చిత్ర వసంతోత్సవాలు అతి వైభవంగా జరిగింది. ఇందులోభాగంగా స్వామివారు వివిధ పుష్పాలంకరణల మధ్య మాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇచ్చారు. పది రోజుల పాటు స్వామివారు వివిధ వాహనాల్లో తిరిగి అలసిపోవడంతో స్వామివారిని ఆలయ కోనేటిలో శివాచార్యుల వేద మంత్రాల నడుమ తీర్థవారి నిర్వహించారు. అనంతరం స్వామి వారిని భక్తుల దర్శనార్థం ఊరేగించారు.

Advertisement
 
Advertisement
Advertisement