తిరుచెందూర్‌లో వేల్‌ ట్రెండ్‌ | - | Sakshi
Sakshi News home page

తిరుచెందూర్‌లో వేల్‌ ట్రెండ్‌

May 1 2026 5:51 AM | Updated on May 1 2026 5:51 AM

● విజయ్‌ బాటలో మంత్రుల దర్శనాలు

సాక్షి, చైన్నె: తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ఇంకా కొద్ది రోజులే సమయం ఉన్న తరుణంలో, తిరుచెందూర్‌ మురుగన్‌ ఆలయంలో రాజకీయ ప్రముఖులు పూజలలో లీనం అవుతున్నారు. టీవీకే అధినేత విజయ్‌ బాటలో చేతిలో వేల్‌తో డీఎంకే మంత్రులు పలువురు దర్శనం చేసుకున్నారు. ఏప్రిల్‌ 28న తమిళగ వెట్రి కళగం అధినేత నటుడు విజయ్‌ తిరుచెందూర్‌ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ పూజారులు ఆయనకు 2 అడుగుల ఎత్తున్న వేల్‌ (మురుగన్‌ ఆయుధం) అందజేశారు. విజయ్‌ ఆ వేల్‌ను చేతబట్టి స్వామిని దర్శించుకోవడమే కాకుండా, శత్రువుల నాశనానికి ప్రతీకగా భావించే శత్రు సంహార మూర్తిని కూడా దర్శించుకుని యాగాది పూజలు చేశారు. ఇది రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

పోటాపోటీగా మంత్రుల దర్శనం

విజయ్‌ సందర్శన జరిగిన రెండు రోజులకే, తమిళనాడు మంత్రులు శేఖర్‌ బాబు , అనితా రాధాకృష్ణన్‌ తదితరులు గురువారం తిరుచెందూర్‌ ఆలయానికి చేరుకున్నారు. విజయ్‌కు 2 అడుగుల వేల్‌ను అందిస్తే, మంత్రులిద్దరికీ ఏకంగా 5 అడుగుల ఎత్తు ఉన్న వేల్‌ను పూజారులు అందజేశారు. వారు కూడా విజయ్‌ తరహాలోనే మూలవరునితో పాటు షణ్ముగర్‌, దక్షిణామూర్తి సన్నిఽధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, మురుగన్‌ భక్తులకు వేల్‌ అంటే విజయానికి చిహ్నం. ఎన్నికల ఫలితాలు మే 4న రానున్న నేపథ్యంలో, తమ ప్రత్యర్థులపై విజయం సాధించాలనే కోరికతోనే నాయకులందరూ శత్రు సంహార మూర్తిని దర్శించుకునేందుకు తిరుచెందూరు వైపుగా క్యూ కడుతుండడం విశేషం. విజయ్‌కు పోటీగా మంత్రులు పెద్ద వేల్‌ను పట్టుకున్నారా? అనే చర్చ ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement