భక్త జనసంద్రం..! | - | Sakshi
Sakshi News home page

భక్త జనసంద్రం..!

Apr 30 2026 8:01 AM | Updated on Apr 30 2026 8:01 AM

● అంగరంగ వైభవంగా మీనాక్షీ సుందరేశ్వర రథోత్సవం ● రేపు కళ్లలగర్‌ వైగై నదీ ప్రవేశం

ఆధ్యాత్మిక నగరం మదురైలో మీనాక్షి సుందరేశ్వర స్వామి రథోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా సాగింది. దీంతో ఆధ్యాత్మిక నగరంలోని వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. హర..హర శంకర...మీనాక్షి సుందర అన్న నామస్మరణను భక్తులు మారుమోగించారు. కాగా చిత్తిరై ఉత్సవాల్లో మరో ప్రధాన ఘట్టం ‘కళ్లలగర్‌’వైగై నదీ ప్రవేశం శుక్రవారం నిర్వహించనున్నారు.

రథోత్సవంలో పాల్గొన్న భక్తులు

సాక్షి, చైన్నె: మదురై మీనాక్షి అమ్మవారి సన్నిధిలో చిత్తిరై ఉత్సవాలు కనుల పండువగా సాగుతున్నాయి. మంగళవారం అమ్మవారి వివాహ మహోత్సవం అత్యంత వేడుకగా జరగ్గా, బుధవారం రథోత్సవం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా వేకువ జామున ఆలయంలో స్వామి, అమ్మవార్లకు విశేష పూజాధి కార్యక్రమాలు జరిగాయి. అభిషేకాది పూజల అనంతరం స్వామి, అమ్మవార్లను వేర్వేరుగా అలంకరించారు. సర్వాలంకారంతో ఉన్న స్వామి అమ్మవార్లు రథంపై ఆశీనులై భక్తులకు దర్శనం ఇచ్చారు. అతిపెద్ద రథంలో సుందరేశ్వర స్వామి, మరో రథంలో మీనాక్షి అమ్మవారి ఆశీనులై ఆలయ మాడా వీధుల్లో ఊరేగారు. ఉదయం 6.30 గంటలకు బయలు దేరిన రథం మధ్యాహ్ననికి యథా స్థనానికి చేరింది. కీల్‌ మాసి వీధి నుంచి తెర్కు మాసి , మేల మాసి, వడక్కు మాసి వీధులలో అడుగడుగునా భక్త జనులు స్వామి, అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు శంఖునాదాలు, కై లాస వాయిద్యాలను హోరెత్తించారు. భక్త కోటి హర..హర శంకర..మీనాక్షి సుందర అన్న శివనామ స్మరణ నడుమ స్వామి వారి రథం ముందుకు సాగగా, వెనుక అమ్మవారి రథం అనుకరించింది. వేలాదిగా భక్త జనం తరలి రావడంతో మదురై జన సంద్రంలో మునిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 2 వేల మందితో గట్టి భద్రతా ఏర్పాట్లను జిల్లా పోలీసు యంత్రాంగం చేసింది. అగ్నిమాపక వాహనాలు, అంబులెన్స్‌లను ముందు జాగ్రత్తగా సిద్ధం చేశారు. మదురై నగరంలోని ఏ ఒక్క వాహనం అనుమతించ లేదు. అలాగే భక్తుల సేవలో పలు సంఘాలు తరలించాయి. రథం మార్గంలో ఉన్న మసీదుల వద్ద భక్తులకు రోస్‌ మిల్క్‌, మజ్జిగ పంపిణి చేసి మత సామరస్యాన్ని చాటుకున్నారు. మరెన్నో సంఘాలు సైతం ఎండ వేడి నుంచి ఉపశమనం కల్గించే విధంగా చలువ వస్తువుల్ని, పానీయాల్ని అందజేశాయి. ఇక మంగళవారం రాత్రి జరిగిన అమ్మవారి వాహన సేవలో భక్తులు మీనాక్షి అమ్మవారు, సుందరేశ్వర స్వామి వేషాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిన్న పిల్లలకు సైతం కరుప్పన్న, అళగర్‌ స్వామి వేషాలతో ఆలయానికి తల్లిదండ్రులు తీసుకొచ్చారు.

రేపు వైగై నదీ ప్రవేశం

ఈ ఉత్సవాల్లో అత్యంత ముఖ్య ఘట్టం శుక్రవారం వైగై నదీ తీరంలో జరగనుంది. ఈ ఉత్సవం నిమిత్తం తేనూర్‌ నుంచి బుధవారం సాయంత్రం బంగారు పల్లకిలో కళ్లలగర్‌ స్వామి (పెరుమాల్‌) బయలు దేరారు. బంగారు పల్లకిలో ఆశీనుడైన రాత్రంతా ప్రయాణించిన స్వామి వారిని పలు గ్రామల గుండా ఊరేగిస్తూ ఉదయాన్నే మదురైకు చేర్చారు. రాత్రంతా దారి పొడవున భక్త జనులు కర్పూర హారతులు పట్టారు. మతాలకు అతీతంగా మార్గ మధ్యలో ఉన్న మసీదుల నుంచి స్వామి వారికి సారె అందజేశారు. అలాగే, ఆ మార్గంలోని పలు ఆలయాల వద్ద స్వామి వారిని ఆహ్వానిస్తూ పూజాధికార్యక్రమాలు జరిగాయి. మదురై కొండప్ప నాయకర్‌ మహల్‌కు గురువారం సాయంత్రం చేరుకునే అళగర్‌ స్వామికి ప్రత్యేక తిరుమంజనంతో పాటుగా రాత్రంతా విశిష్ట పూజలు జరుగుతాయి. శుక్రవారం ఉదయాన్నే బంగారు అశ్వరథంపై స్వామి వారు వైగై నదీ ప్రవేశానికి వెళ్లనున్నారు. ఇందు కోసం వైగై నదీ తీరంలో సర్వం సిద్ధం చేశారు. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు లక్షల్లో భక్తులు తరలి వస్తారు కాబట్టి, గట్టి భద్రతా ఏర్పాట్లు చే శారు. ఆ పరిసరాల్ని నిఘా వలయంలోకి తెచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement