సాక్షి, చైన్నె : చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు నాలుగు రోజులే సమయం ఉండటంతో, ఎన్నికల కమిషన్ సన్నద్ధతను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా చైన్నెలో ఓట్ల లెక్కింపుపై అధికారులకు ఒక రోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కౌంటింగ్‌లో పారదర్శకతే లక్ష్యంగా పలు సూచనలు,సలహాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ వివరించారు. వివరాలు.. తమిళనాడు శాసనసభ ఎన్నికల తుది ఘట్టానికి రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 23న జరిగిన పోలింగ్‌లో రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 85.15 శాతం ఓట్లు నమోదయ్యాయి. ఇప్పుడు అందరి దష్టి మే 4న జరగనున్న ఓట్ల లెక్కింపుపైనే ఉంది.
కౌంటింగ్ ఏర్పాట్లు
మే 4వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఉదయం 8 గంటలకు మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. అనంతరం 8.30 గంటల నుండి ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఉదయం 9 గంటల నుండే తొలి ఫలితాల సరళి వెలువడే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా మొ త్తం 62 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలో సాధారణంగా 14 టేబుళ్లను, పెద్ద నియోజకవర్గాల్లో 20 నుండి 28 టేబుళ్లను ఏర్పాటు చేశారు.
పరిశీలకుల నియామకం
ఓట్ల లెక్కింపులో పారదర్శకత కోసం భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడుతో సంబంధం లేని ఇతర రాష్ట్రాలకు చెందిన 234 మంది ఐఏఎస్ అధికారులను కౌంటింగ్ అబ్జర్వర్లుగా (పరిశీలకులుగా) నియమించింది. ప్రతి నియోజకవర్గానికి ఒక పరిశీలకుడు పర్యవేక్షణ చేస్తారు. ప్రతి రౌండ్ ముగిసిన తర్వాత, ఈ పరిశీలకులు సంతకం చేసిన తర్వాతే ఆ రౌండ్ ఫలితాలను ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటిస్తారు.: 62 కౌంటింగ్ కేంద్రాల వద్ద పారామిలిటరీ దళాలు రాష్ట్ర పోలీసులతో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. సిసిటివి కెమెరాల నిఘాలో స్ట్రాంగ్ రూమ్‌లను భద్రపరిచారు.ఈ భద్రతా ఏర్పాట్ల గురించి, కౌంటింగ్ ఏర్పాట్లను గురించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయికుమార్, డీజీపీ సందీప్ రాయ్ రాథోర్‌లు బుధవారం సచివాలయంలో సమీక్ష సమావేశాన్ని సైతం నిర్వహించిన పకడ్బందీ చర్యలకు నిర్ణయించారు. భద్రతా విధులలో 80 వేల పోలీసులు, సీఆర్‌పీఎఫ్, పారా మిలటరీ నిమగ్నం కానున్నాయి. అలాగే దాదాపు లక్ష మంది ప్రభుత్వ సిబ్బంది లెక్కింపు ప్రక్రియలో పాల్గొంటున్నారు. వారికి ఇప్పటికే అవసరమైన శిక్షణను పూర్తి చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
ఓట్ల లెక్కింపుపై అధికారులకు శిక్షణ
చైన్నెలో ఓట్ల లెక్కింపుపై అధికారులకు ఒక రోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అర్చన పట్నాయక్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో సహా సుమారు 1,000 మంది పాల్గొన్నారు. చైన్నె, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల నుండి అధికారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పుదుచ్చేరికి చెందిన నిపుణుడు జ్ఞానవేల్ ఓట్ల లెక్కింపు పద్ధతులను వివరించారు. పోస్టల్ ఓట్లు, సర్వీస్ (సైనిక) ఓట్లు ,ఈవీఎంలలోని ఓట్లను ఎలా లెక్కించాలో అధికారులకు ప్రాక్టికల్‌గా వివరించారు. కౌంటింగ్ ఏజెంట్లు పాటించాల్సిన నిబంధనలను తెలియజేశారు.
వదంతులతో కలకలం
చైన్నె లయోలా కాలేజీ కౌంటింగ్ కేంద్రంపై వదంతులు బయలు దేరడంతో సైబర్ క్రైమ్ పోలీసుల సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. చైన్నెలోని లయోలా కళాశాల ఓట్ల లెక్కింపు కేంద్రం నుండి అంబులెన్స్‌లో ఈవీఎం యంత్రాలను రహస్యంగా తరలించారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని చైన్నె మెట్రోపాలిటన్ పోలీసులు ఖండించారు. వదంతులు వ్యాప్తి చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఏప్రిల్ 24వతేదీతెల్లవారు జామున లయోలా కళాశాలలోని విల్లివాక్కం కౌంటింగ్ కేంద్రంలో లిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసన్ (నిసాన్) అకస్మాత్తుగా ఫిట్స్ (మూర్ఛ) వచ్చి పడిపోయాడని, అతడిని ఆస్పత్రిలో చేర్పించడం కోసమే అంబులెన్స్ వచ్చినట్టు వివరణ ఇచ్చారు. కాగా, చైన్నెలో ఓట్ల లెక్కింపు కోసం 1,005 మంది సిబ్బంది ఎంపిక చేసినట్లు తెలిపారు.


