జాతీయ స్థాయిలోని అనేక కీలక సంస్థలే కాకుండా, తమిళనాడులోని పలు టీవీ చానళ్లు, మరికొన్ని సంస్థలు సైతం సర్వేలు నిర్వహించాయి. ప్రజా నాడి ఏమిటో పసిగట్టే దిశగా ప్రయత్నించి ఎగ్జిట్ పోల్స్ రూపంలో ప్రకటించాయి. కొన్ని సంస్థలు మొబైల్ పోన్ల ద్వారా, యాప్ ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా, వివిధ చర్చల ద్వారా లభించిన సమాచారాలతో తమ సర్వే ఫలితాలను ప్రకటించాయి. ఇందులో మెజారిటీ శాతం డీఎంకే వైపే మొగ్గు చూపాయి. ఇందులో కీలక సంస్థలుగా ఉన్న పీపుల్స్ పల్స్, ఎన్‌డీటీవీ సర్వేలలో డీఎంకే కూటమికి 125 నుంచి 145, అన్నాడీఎంకే కూటమికి 65 నుంచి 80, టీవీకేకు 18–24, ఇతరులకు 2–6 సీట్ల వస్తాయని ప్రకటించారు. చాణుక్య స్ట్రాటజీస్ అయితే, డీఎంకేకు 145–160, అన్నాడీఎంకేకు 50–65, విజయ్ టీవీకేకు 13–18, ఇతరులకు 5–8 స్థానాలు లభిస్తాయని వివరించారు. అలాగే, న్యూ మ్యాట్రిక్స్ డీఎంకేకు 122–132, అన్నాడీఎంకేకు 87–110, టీవీకేకు 10–12, ఇతరులకు ఆరు స్థానాలు వస్తాయని ప్రకటించారు. రిపబ్లిక్ పీ మార్క్ డీఎంకేకు 125–145, అన్నాడీఎంకేకు 65–85, టీవీకేకు 16–26, ఇతరులకు 1–6 స్థానాలు దక్కుతాయని, అగ్ని సంస్థ సర్వేలో డీఎంకేకు 169, అన్నాడీఎంకేకు 64, విజయ్ టీవీకేకు ఒకటి, ఇతరులకు సున్నా అన్న సర్వే వివరాలను విడుదల చేశాయి. ఈ ఐదు కీలక సంస్థలు డీఎంకేకు అనుకూలంగా ఓటరు నాడీ అంటూ ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేయగా, మరో రెండు కీలక సంస్థలు అన్నాడీఎంకే వైపుగా మొగ్గు చూపడం గమనార్హం. అలాగే, మరికొన్ని సామాజిక మాధ్యమాలు కూడా అన్నాడీఎంకేకు గెలుపు అవకాశం అన్నట్టుగా సర్వేలను విడుదల చేశాయి.
స్టాలిన్, విజయ్, పళణి స్వామి


