సాక్షి, చైన్నె: తమిళనాడు ప్రభుత్వంలో అత్యంత కీలక బాధ్యతలు నిర్వహించిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి, ప్రస్తుతం సామాజిక సంక్షేమ ,మహిళా భివద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న జయశ్రీ మురళీధరన్ స్వచ్ఛంద పదవీ విరమణ ప్రకటించారు.
ముఖ్యమంత్రుల నమ్మకస్తురాలు
జయశ్రీ మురళీధరన్ దివంగత ముఖ్యమంత్రి జె. జయలలిత హయాంలో అదనపు కార్యదర్శిగా పనిచేశారు. జయలలితకు అత్యంత విశ్వసనీయ అధికారిణిగా ఆమెకు పేరుంది. ఆ తర్వాత ఎడప్పాడి పళనిస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఆయనకు కార్యదర్శిగా సేవలందించారు. ఇక ఆమె 2011 నుండి 2014 వరకు ఆమె తిరుచిరాపల్లి (తిరుచ్చి) జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో జయలలిత శ్రీరంగం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఉన్నందున, అక్కడ అనేక అభివృద్ధి ప్రాజెక్టులను జయశ్రీ మురళీధరన్ విజయవంతంగా అమలు చేశారు. తాజాగా సీఎం స్టాలిన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన ’ఉదయం అల్పాహార పథకం’ అమలులో ఆమె కీలక పాత్ర పోషించారు. దీనికి సంబంధించిన మెనూ రూపకల్పన , పంపిణీ బాధ్యతలను ఆమె సమర్థవంతంగా నిర్వహించారు. సహకార సంఘాల రిజిస్ట్రార్‌గా, సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారిగా , దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా ఆమెకు అపారమైన అనుభవం ఉంది. వాస్తవానికి ఆమె జనవరి 2027లో పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే, వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని నెలల ముందే ఆమె వీఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం ఆమె దరఖాస్తును ఆమోదించడంతో బుధవారం విధుల నుంచి వైదొలగారు. ప్రభుత్వ సేవల నుండి విరమణ పొందిన తర్వాత, ఆమె ఓ ప్రముఖ పారిశ్రామిక సంస్థలో కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సన్నిహిత వర్గాల సమాచారం.


