వేలూరు: కౌంటింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి సుబ్బలక్ష్మి అధికారులను ఆదేశించారు. వేలూరు, అనకట్టు నియోజక వర్గాలకు వేలూరు తందై పెరియార్ ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ జరగనుంది. దీంతో కౌంటింగ్‌కు సంబందించి ఏర్పాట్లును జిల్లా ఎన్నికల అధికారి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజక వర్గాలకు వేలూరు తొర్రపాడిలోని తందై పెరియార్ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగిందన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రం ఆవరణంలో ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు, టపాకాయలు పేల్చడం, ఎటువంటి ఆడంబరాలు చేయకుండా ఉండే విధంగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ ద్వారంలోనే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి కార్యకర్తలను అనుమతించబోమన్నారు. అనంతరం ఈవీఎంలు భద్ర పరిచి సీల్ వేసిన ప్రాంతాన్ని పరిశీలించడంతో పాటూ సీసీ కెమెరాలను పరిశీలించారు. అనంతరం అక్కడ ఉంచిన రిజిస్ట్రర్‌లో సంతకాలు చేశారు.


