● నేడు అభ్యర్థులతో భేటీకి నిర్ణయం
సాక్షి, చైన్నె: తమిళ వెట్రి కళగం అధ్యక్షుడు, నటుడు విజయ్ బుధవారం మహారాష్ట్రలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం షిరిడీలో సాయిబాబాను దర్శించుకున్నారు. గురువారం చైన్నెలో ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులతో సమావేశానికి ఏర్పాట్లు చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే 233 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 85 శాతం ఓటింగ్ నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రమంతటా పర్యటించిన విజయ్, ప్రస్తుతం ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. మంగళవారం ఆయన తమిళనాడులోని తిరుచెందూర్ మురుగన్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బుధవారం ఉదయం చైన్నె నుంచి ప్రత్యేక విమానంలో మహారాష్ట్ర చేరుకున్న విజయ్, అక్కడి నుంచి కారులో షిరిడీ వెళ్లారు. సాయిబాబాను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. షిరిడీలో విజయ్‌ను చూసిన అభిమానులు , భక్తులు ఆయనతో ఫొటోలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. మే 4న ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఆయన ఆధ్యాత్మిక పర్యటనలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. గురువారం చైన్నెలో పార్టీ అభ్యర్థులతో సమావేశానికి విజయ్ నిర్ణయించారు. పనయూరులో సాయంత్రం 3 గంటల నుంచి ఈ సమావేశం జరగనుంది.


