తిరుత్తణి: పనసపండ్ల సీజన్ ప్రారంభం కావడంతో తిరుత్తణిలో పనసపండ్లను రాశులుగా పోసి వ్యాపా రులు విక్రయాలు నిర్వహిస్తున్నారు. తమిళంలో ముక్కని అంటే ముఖ్యమైన మూడు పండ్లుగా గుర్తింపు పొందిన మామిడి, అరటి, పనసపండ్లు. ఈ మూడు పండ్లు ప్రతి శుభ కార్యక్రమం విందులో వినియోగిస్తారు. దీంతో వీటికి ముక్కని అని తమిళనాట ప్రసిద్ది. కడలూరు జిల్లా బన్రూటి ప్రాంతం పనస తోటలకు ప్రసిద్ధి. ఈ ప్రాంతంలోని పనసపండ్ల తోటలను రైతులు వ్యవసాయంగా సాగుచేస్తున్నారు. ఏడాదిలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు పనస సీజన్. బన్రూటి పనస అంటే దేశ వ్యాప్తంగా డిమాండ్ వుంది. పనస సీజన్ ప్రారంభంతో తిరుత్తణికి చెందిన వ్యాపారులు బన్రూటిలో వ్యాపారుల వద్ద నేరుగా కేజీ రూ.20 నుంచి 40 వరకు కొనుగోలు చేసి తీసుకొచ్చి వ్యాపారం చేస్తున్నారు. తిరుత్తణిలో రహదారుల పక్కన, రైల్వేస్టేషన్, బస్టాప్, తిరుత్తణి కొండ ఆలయాల్లో కేజీ రూ.200 కు విక్రయిస్తున్నారు. దీంతో విక్రయాలు ఆశాజనకంగా వున్నట్లు వ్యాపారులు అంటున్నారు.


