కన్నీటితో స్వస్థలాలకు.. | - | Sakshi
Sakshi News home page

కన్నీటితో స్వస్థలాలకు..

Apr 30 2026 7:55 AM | Updated on Apr 30 2026 7:55 AM

కువాగంలో తాళి తెంచి పడేసి హిజ్రాల వేదన వితంతువులుగా మారి విషాదంతో వెనక్కి ఘనంగా రథోత్సవం – అరవాన్‌ బలి దానం

సాక్షి, చైన్నె: కూవాగంలో గత కొద్ది రోజులు సందడి చేసిన హిజ్రాలు బుధవారం విషాదంతో స్వస్థలాలకు తిరుగు పయనం అయ్యారు. మంగళవారం కట్టుకున్న మంగళ సూత్రాలను తెంచి పడేసి ఒప్పారి పెట్టారు. తెల్ల చీరలు ధరించి వితంతువులుగా మారి కూవాగం నుంచి తిరుగు పయనం అయ్యారు. ముందుగా కూత్తాండవర్‌ రథోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. అరవాన్‌ బలిదానంతో హిజ్రాలలో విషాదం నెలకొంది. వివరాలు.. రాష్ట్రంలోని కళ్లకురిచ్చి జిల్లా ఉలుందూర్‌ పేట సమీపంలోని కూవాగం గ్రామంలోని కూత్తాండవర్‌ ఆలయంలో రెండు వారాల పాటూ చిత్తిరై ఉత్సవాలు అత్యంత వేడుకగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గత మూడు రోజులు హిజ్రాల సందడితో కూవాగం నిండింది. దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున హిజ్రాలు తరలి వచ్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు. మంగళవారం సాయంత్రం కొత్త పెళ్లి కూతుళ్ల వలే ముస్తాభైన హిజ్రాలు కూత్తాండవర్‌ ఆలయం వద్దకు చేరుకోనున్నారు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి, ఆలయ పూజారి చేతుల మీదుగా తాళి బొట్టు కట్టించుకుని ఆనంద పారవశ్యంలో మునిగి తేలారు. రాత్రంతా ఆట పాటలతో సందడి చేశారు.

రథోత్సవంతో..

బుధవారం ఉదయం కూత్తాండవర్‌ రథోత్సవ సేవ ఘనంగా జరిగింది. ఈ రథోత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా జన సందోహం తరలివచ్చారు. రథోత్సవ సేవ అనంతరం అరవాన్‌ బలిదానం జరిగింది. అరవాన్‌ను తమ ఆరాధ్యుడిగా భావించే హిజ్రాలు ఈ కార్యక్రమంతో ఒక్క సారిగా హిజ్రాలు విషాదంలో మునిగారు. తాము కట్టుకున్న మంగళ సూత్రాలను తెంచి పడేసి కన్నీటి సంద్రంలో మునిగారు. ఏడుపులు పెడబొప్పలతో ఒప్పారి పెట్టారు. అక్కడి కొలనులో స్నానం చేసి తెల్ల చీరల్ని ధరించి తమ స్వస్థలాలకు తిరుగు పయనం అయ్యారు. గత మూడు నాలుగు రోజులుగా హిజ్రాల సందడిలో మునిగిన కూవాగంలో చివరి రోజు సాగిన విషాద ఉత్సవంతో వితంతువులు అవతారంతో తమ స్వస్థలాలకు హిజ్రాలు వెనుతిరిగారు.

Advertisement
 
Advertisement
Advertisement