సెంథిల్‌ మెడకు ట్రాన్స్‌ఫార్మర్ల ఉచ్చు | - | Sakshi
Sakshi News home page

సెంథిల్‌ మెడకు ట్రాన్స్‌ఫార్మర్ల ఉచ్చు

Apr 30 2026 7:55 AM | Updated on Apr 30 2026 7:55 AM

● అక్రమాలపై విచారణకు హైకోర్టు ఆదేశాలు ● కేసు సీబీఐకు అప్పగింత

సాక్షి, చైన్నె: డీఎంకే మాజీ మంత్రి సెంథిల్‌ బాలాజీ మెడకు ట్రాన్స్‌ ఫార్మర్ల కొనుగోలు అక్రమాల కేసు ఉచ్చు బిగియనుంది. ఈ కేసును ముందుకు తీసుకెళ్లే విధంగా విచారణను సీబీఐకు అప్పగిస్తూ మద్రాసు హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వివరాలు.. విద్యుత్‌, ఎకై ్సజ్‌ శాఖమంత్రిగా ఉన్న సెంథిల్‌ బాలాజీ మెడకు గతంలో అన్నాడీఎంకే హయాంలో రవాణా శాఖలో జరిగిన క్యాష్‌ ఫర్‌ జాబ్స్‌ కేసు ఉచ్చుగా మారిన విషయం తెలిసిందే. ఏడాది కాలం పైగా ఆయన జైలులో ఉండాల్సి వచ్చింది. మంత్రి పదవిని సైతం కోల్పోవాల్సి వచ్చింది. అయినా, ఆయన్ని డీఎంకే ఏన్నడూ వీడ లేదు. కొంగు మండలం పార్టీ ఇన్‌చార్జ్‌గా నియమించి అసెంబ్లీ ఎన్నికలలో కీలక పాత్రను పోషించే విధంగా చేసింది. ఈ పరిణామాలు ఓ వైపు ఉంటే, మరో వైపు విద్యుత్‌ మంత్రిగా సెంథిల్‌ బాలాజీ ఉన్న సమయంలో ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలులో అవినీతి కేసు తాజాగా తెర మీదకు రావడం గమనార్హం.

కేసు నేపథ్యం ఇదీ..

2021 నుండి 2023 మధ్య కాలంలో సెంథిల్‌ బాలాజీ విద్యుత్‌ శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఈ సమయంలో సుమారు 45,000 ట్రానన్స్‌ఫార్మర్ల కొనుగోలు ప్రక్రియలో ప్రభుత్వ ఖజానాకు రూ. 397 కోట్ల నష్టం వాటిల్లిందని అరప్పోర్‌ ఇయక్కం అనే స్వచ్ఛంద సంస్థతో పాటు అన్నాడీఎంకే నాయకులు శరవణన్‌, రాజ్‌కుమార్‌లు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

కోర్టు కీలక ఆదేశాలు

మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఏ. ధర్మాధికారి, జస్టిస్‌ జి.అరుల్‌ మురుగనన్‌తో కూడిన ధర్మాసనం ఈ కేసును బుధవారం విచారించింది. ఈ అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపేందుకు కేసును రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ నుండి సీబీఐకి బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను రెండు వారాల్లోగా సీబీఐకి అందజేయాలని అవినీతి నిరోధక శాఖను ఆదేశించారు. సీబీఐ దర్యాప్తునకు తమిళనాడు విద్యుత్‌ బోర్డు, రాష్ట్ర ప్రభుత్వం, అవినీతి నిరోధక శాఖ పూర్తిస్థాయిలో సహకరించాలని ఆదేశించారు. కేసును స్వతంత్ర సంస్థకు బదిలీ చేయడం అనేది కేవలం పారదర్శకత కోసమేనని, ఇది ఎవరినీ దోషులుగా నిర్ధారించినట్లు కాదని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. సీబీఐ ఈ వ్యవహారంపై కొత్తగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణను వేగవంతం చేయాలని కోర్టు ఆదేశించడంతో మున్ముందు రోజులలో మళ్లీ సెంథిల్‌ బాలాజీని ఇరకాటంలో పెట్టే దిశగా కేంద్రం పెద్దలు పావులు కదపడం ఖాయమనే ప్రచారం జోరందుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement