ఎగ్జిట్‌ పోల్స్‌పై ఉత్కంఠ | - | Sakshi
Sakshi News home page

ఎగ్జిట్‌ పోల్స్‌పై ఉత్కంఠ

Apr 29 2026 8:00 AM | Updated on Apr 29 2026 8:00 AM

● నేడు వెలువడే అవకాశం ● కౌంటింగ్‌ సిబ్బందికి నేటి నుంచి శిక్షణ

సాక్షి, చైన్నె : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ బుధవారంతో ముగియనుంది. దీంతో తమిళనాడు, పుదుచ్చేరిలలో ఎగ్జిట్‌ పోల్స్‌పై సర్వత్రా దృష్టి పడింది. బుధవారం సాయంత్రం తర్వాత పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌పోల్స్‌ ఎలా ఉండబోతున్నాయో అన్న ఉత్కంఠ నెలకొంది. వివరాలు.. తమిళనాడుకు పొరుగున ఉన్న పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్‌ 9వ తేదీ ముగిసింది. ఇక్కడ కాంగ్రెస్‌ , డీఎంకే ఇండియా కూటమి, ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌, బీజేపీ ఎన్‌డీఏ కూటమి మధ్య ప్రధాన సమరం నెలకొంది. ఇక్కడ విజయ్‌ టీవీకే సైతం పోటీ చేయడంతో ఓట్ల చీలిక చర్చ జరుగుతున్నది. 92 శాతం మేరకు ఇక్కడ ఓటింగ్‌ జరగడంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. అయితే, ఎన్నికల తుది ప్రక్రియ ముగిసే వరకు ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదల చేయడానికి వీలు లేదు కాబట్టి, ఉత్కంఠగా పుదుచ్చేరిలోని పార్టీల నేతలు ఎదురుచూస్తూ వచ్చారు. ఆ తదుపరి ఈనెల 23వ తేదిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇక్కడ 86 శాతం మేరకు ఓటింగ్‌ జరిగింది. విజయ్‌ టీవీకే ప్రభావంతోనే ఓటు బ్యాంక్‌ పెరిగిందన్న చర్చ ఊపందుకు ని ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో గెలుపు గుర్రా లు ఎవరో అన్న ఉత్కంఠ, చర్చ గత వారం రోజులు రాష్ట్రంలో జరుగుతూ వచ్చాయి. ఈ పరిస్థితులలో బుధవారం పశ్చిమ బెంగాల్‌లో తుది విడత సమరం ముగియనున్నడంతో ఎన్నికల ఓటింగ్‌ ప్రక్రియ ముగిసినట్టే. దీంతో ఆయా సంస్థలు తమ ఎగ్జిట్‌పోల్స్‌ వివరాలను వెల్లడించేందుకు సిద్ధమయ్యాయి. రాష్ట్రంలోని టీవీ ఛానళ్లు, కొన్ని ప్రైవేటు సంస్థలు, జాతీయ స్థాయిలోని సంస్థలు అనేకం ఇప్పటికే తమ సర్వేను ముగించి ఉన్నాయి. తమ ఫలితాలను విడుదల చేయనున్నడంతో తమిళనాడులో, పుదుచ్చేరిలో ఎవరికి ఓటర్లు పట్టం కట్టే విధంగా ఎగ్జిట్‌ పోల్స్‌ వస్తాయో అన్న ఉత్కంఠ తో ఎదురుచూపులు పెరిగాయి.

కౌంటింగ్‌ అధికారులకు శిక్షణ

తమిళనాడులో 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓటింగ్‌ యంత్రాలను 62 కేంద్రాల్లో అత్యంత కట్టుదిట్టమైన నాలుగు అంచెల భద్రత మధ్య భద్రపరిచిన విషయం తెలిసిందే. మే 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఎన్నికల అధికారులు, సిబ్బందికి బుధవారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ప్రారంభం కానుంది. అన్ని కౌంటింగ్‌ కేంద్రాలలో ఈ శిక్షణ ప్రక్రియకు ఏర్పాట్లు చేశారు.

విజయ్‌ ఫ్యాక్టర్‌ ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

తమిళనాడులో ఈసారి ప్రధాన పోటీ డీఎంకే , అన్నాడీఎంకే కూటముల మధ్య ఉన్నప్పటికీ, నటుడు విజయ్‌ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభావంపైనే అందరి దృష్టి నెలకొంది. విజయ్‌ పార్టీ చీల్చే ఓట్లు అధికార డీఎంకే కూటమిపై ప్రభావం చూపుతాయా లేక అన్నాడీఎంకే ఓటు బ్యాంక్‌ను దెబ్బతీస్తాయా అన్నది సోషల్‌ మీడియాలో ఇప్పటికే హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ ముక్కోణపు సమరంలో కొన్ని నియోజకవర్గాల్లో విజయ్‌ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందన్న అంచనాల నడుమ, ప్రధాన పార్టీలలో టెన్షన్‌ మొదలైంది. వీటన్నింటినీ ఒక కొలిక్కి తెచ్చే రీతిలో పోల్స్‌ ఉంటాయా? లేదా ఏకపక్షంగా ఉండబోతున్నాయా? అన్నది మరికొన్ని గంటలలో సర్వే ఫలితాలు స్పష్టం చేయబోతున్నాయి. ప్రస్తుతం కొడైకెనాల్‌లో ఉన్న సీఎం స్టాలిన్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడ్డ తదుపరి 30వ తేదీన చైన్నెకురానున్నారు. ఇక, సేలంలోని స్వగ్రామంలో ఉన్న అన్నాడీఎంకే పళణి స్వామి సైతం చైన్నెకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక టీవీకే అధినేత విజయ్‌ మంగళవారం తిరుచెందూరులో ప్రత్యేక పూజలు, శత్రు సంహార పూజలు నిర్వహించడమే కాకుండా షిరిడీ వెళ్లేందుకు సిద్ధం అవుతుండడం గమనార్హం. ఇక తొలిసారిగా ఎన్నికలలో నిలబడ్డ నామ్‌ తమిళర్‌ కట్చి నేత సీమాన్‌ కారైక్కుడిలో నెగ్గేనా అన్నది ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేస్తాయో.. లేదో.. చూడాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement