– ప్రారంభించిన గవర్నర్
సాక్షి, చైన్నె: చైన్నెలో శ్రీ అగర్వాల్ సభ ప్లాటినం జూబ్లీ వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రముఖ సామాజిక సంస్థగా ఉన్న శ్రీ అగర్వాల్ సభ 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా చైన్నెలోని లేడీ ఆండల్ స్కూల్ ఆడిటోరియంలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. బెంగళూరుకు చెందిన మిరాకిల్ ఆన్ వీల్స్ బృందం నేతృత్వంలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించారు. సమాజ సేవలో విశేష కృషి చేసిన పలువురు ప్రముఖులను, కమ్యూనిటీ సభ్యులను ఈ సందర్భంగా గవర్నర్ సత్కరించారు. ప్లాటినం జూబ్లీ ఛైర్మన్ విజయ్ కుమార్ గోయల్ 75 ఏళ్ల ప్రయాణం, సేవలను గురించి వివరించారు. ఈ కార్యక్రమం శ్రీ అగర్వాల్ సభ అధ్యక్షుడు సీతారామ్ గోయల్, ప్రధాన కార్యదర్శి బాల్ గోవింద్ గుప్తా, ఈవెంట్ ఛైర్మన్ అరుణ్ కుమార్ సుల్తానియా, మహిళా సమితి, మహిళా మండల్, యూత్ అసోసియేషన్ ప్రతినిధులు ఈ వేడుకలో పాల్గొన్నారు. చివరగా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్‌ను సంస్థ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు.
ప్రభుత్వ బస్సును ఢీకొన్న లారీ
తిరువొత్తియూరు: దిండివనం సమీపంలో ప్రభుత్వ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందగా 40 మంది ప్రయాణికులు గాయాలయ్యాయి. వివరాలు.. నాగర్‌కోయిల్ నుండి చైన్నె వైపు వెళ్తున్న ప్రభుత్వ లగ్జరీ బస్సు, 40 మందికి పైగా ప్రయాణికులతో దిండివనం సమీపంలోని సాలవాతి వద్దకు చేరుకుంది. ఆ సమయంలో నాలుగు రోడ్ల కూడలి వద్ద తిరువణ్ణామలై మార్గం నుండి పుదుచ్చేరి వైపు వెళ్తున్న లారీ బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ శక్తివేల్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో లారీ డ్రైవర్ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం దిండివనం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులో ప్రయాణిస్తున్న 40 మందికి పైగా ప్రయాణికులు గాయపడగా, వారిని చికిత్స కోసం దిండివనం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ప్రమాదం కారణంగా తిండివనం–తిరుచ్చి జాతీయ రహదారిపై సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోజుకు 20 వేల మెగావాట్లు
సాక్షి, చైన్నె: రాష్ట్రంలో రికార్డు స్థాయికి విద్యుత్ వాడకం పెరిగింది. సాధారణంగా రోజుకు 16 వేల మెగావాట్లు ఉండే వాడకం మంగళవారం 20,000 మెగావాట్లకు చేరుకుంది. మే 4న అగ్ని నక్షత్రం మొదలయ్యే వేళ ఈవాడకం 22 వేల మెగావాట్లకు చేరే వకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.రాష్ట్రంలో భానుడు భగ.. భగ మండుతున్నాడు. ఎండ నుంచి ఉపశమనం కోసం జనం ఏసీల వాడకం పెరిగింది. దీంతో అవసరాలకు తగ్గట్టుగా విద్యుత్ సరఫరా చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ప్రస్తుతం థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా 4,000, సౌర విద్యుత్ ద్వారా 6,000, కొనుగోలు ఒప్పందాల ద్వారా 4 వేలు, స్వల్ప కాలిక కొనుగోలు ద్వారా 2 వేల మెగావాట్ల విద్యుత్‌ను పొందుతున్నారు. అదనంగా జలన, పవన విద్యుత్ ద్వారా ఉత్పత్తి అయ్యేవిద్యుత్‌ను పూర్తిగా రానున్న రోజులలో అంతరాయం అన్నది లేకుండా సరఫరా చేయడానికి చర్యలు చేపట్టారు. తాజాగా పెరుగుతున్న వాడకం, డిమాండ్‌కు అనుగుణంగా రాబోయే పది సంవత్సరాలకు ఉపయోగపడే రీతిలో కొత్త విద్యుత్ పథకాలకు తగ్గ ప్రణాళిక రూపకల్పనలో సైతం విద్యుత్ బోర్డు అధికారులుఉన్నారు. ఈ మేరకు 2026–27 నుండి 2035–36 వరకు రాబోయే పదేళ్ల కాలానికి విద్యుత్ డిమాండ్ సరఫరాను సమతుల్యం చేయడం కోసం ప్రత్యేక కార్యాచరణకు సిద్ధమయ్యారు.
బాలురు, బాలికలపై
లైంగిక వేధింపులు
– యువకుడికి 34 ఏళ్ల జైలు శిక్ష
అన్నానగర్: సేలం జిల్లా, అమ్మపేట, భారతియార్ వీధి నివాసి అయిన మణి కంఠన్ (30) కూలీ. 2022లో 8 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి, లైంగికంగా వేధించాడని పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, మణి కంఠనన్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు. విచారణ అనంతరం మణి కంఠన్ మరికొందరు బాలురు బాలికలను లైంగికంగా వేధించినట్లు తేలడంతో అతడికి 34 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.


