సాక్షి, చైన్నె: 2025–26 ఆర్థిక సంవత్సరంలో 10.83 శాతం ఆర్థిక వృద్దిని తమిళనాడు తాజాగా నమోదు చేసిందని సీఎం స్టాలిన్ ప్రకటించారు. వరుసగా రెండో ఏడాది కూడా రెండంకెల ఆర్థిక వృద్ధిని నమోదు చేసి రికార్డు సృష్టించామన్నారు. తమిళనాడుకు ఇకపై పోటీ అన్నది ఇతర భారతీయ రాష్ట్రాలతో కాదని, దక్షిణాసియాలోనే అగ్రగామి రాష్ట్రంగా ఎదగడమే తమ లక్ష్యమని ప్రకటించారు. కేంద్ర గణాంక శాఖ విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం తమిళనాడు ఆర్థిక పరిస్థితి వరుసగా రెండు సంవత్సరాలు రెండంకెల వృద్ధిరేటును నమోదు చేసింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి 11.19 శాతం, 2025–26 ఆర్థిక సంవత్సరానికి 10.83శాతం అంటూ 10 శాతానికి పైగా వృద్ధిని సాధించడం తమిళనాడు ప్రభుత్వ పరిపాలనా దక్షతకు నిదర్శనమన్న చర్చ తెర మీదకు వచ్చింది. ఇందుకు ఎక్స్ పేజీలో సీఎం స్టాలిన్ స్పందిస్టూ మంగళవారం ట్వీట్ చేశారు.
విజయానికి మారు పేరు..
‘తమిళనాడు అంటేనే విజయాలకు మారుపేరు. మా ద్రావిడ మోడల్’ పరిపాలనను అంకెల్లో కూడా నిరూపిస్తున్నాం’ అని వ్యాఖ్యలు చేశారు.. మొదటి మూడేళ్లలో బలమైన పునాది వేసి, ఇప్పుడు వరుసగా రెండేళ్లు రెండంకెల వృద్ధిని సాధించామని ఈ విజయంలో భాగస్వాములైన ప్రజలందరికీ ధన్యవాదాలు అని పేర్కొన్నారు. భారతదేశంలోనే కాకుండా, మొత్తం దక్షిణాసియాలోనే తమిళనాడును ప్రథమ స్థానంలో నిలబెట్టడం లక్ష్యంగా తెలిపారు. ప్రభుత్వ సమర్థవంతమైన నిర్వహణ, ప్రజల కష్టార్జితమే ఈ వృద్ధికి కారణమని సీఎం పేర్కొన్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో మరిన్ని మైలురాళ్లను అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
కొడైకెనాల్‌లో స్టాలిన్ సైక్లింగ్
కుటుంబంతో కలిసి కొడైకెనాల్‌లో ఐదు రోజుల విశ్రాంతి పర్యటనలో స్టాలిన్ ఉన్న విషయం తెలిసిందే.మూడవ రోజైన మంగళవారం వాకింగ్‌తో పాటూ సైక్లింగ్‌లో సీఎం దూసుకెళ్లారు. ఉదయాన్నే కొడైకెనాల్‌లోని ప్రసిద్ధ నక్షత్ర సరస్సు ప్రాంతంలో సీఎం స్టాలిన్ వాకింగ్ చేశారు. ఆ తర్వాత సరస్సు చుట్టూ సైకిల్ పై చక్కర్లు కొట్టారు.
ప్రజలకు సూచనలు..
నడక సాగిస్తున్న సమయంలో తనను కలిసిన పర్యాటకులు, స్థానికులతో ఆయన ముచ్చటించారు. ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తప్పనిసరిగా వాకింగ్ చే యాలని వారికి సూచించారు. తనను చూసేందుకు వచ్చిన ప్రజలకు ఆయన అభివాదం చేశారు. చాలా మంది పర్యాటకులు ఆయనతో సెల్ఫీ తీసుకునేందుకు ఆసక్తి చూపారు. మధ్యలో ఒక హోటల్ వద్ద ఆగి టీ తాగుతూ కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం ఆయన మన్నవనూర్‌లోని కేంద్రప్రభుత్వ గొర్రెల పరిశోధనా కేంద్రం, కుందేళ్ల ఫారం, అటవీ శాఖ ఆధ్వర్యంలోని ఎకో టూరిజం సెంటర్‌ను సందర్శించారు.


