సాక్షి, చైన్నె : ఒకే వ్యక్తి రెండు చోట్ల ఎన్నికలలో పోటీ చేసే విఽషయంపై దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు మద్రాసు హైకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్ విచారణను మంగళవారం న్యాయమూర్తులు తోసి పుచ్చారు. వివరాలు.. మదురైకి చెందిన మణి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం, అభ్యర్థులు అసెంబ్లీ లేదా లోకసభ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశం ఉందన్నారు. ఒకవేళ అభ్యర్థి రెండు చోట్లా గెలిస్తే, ఒక నియోజకవర్గానికి రాజీనామా చేయాల్సి ఉంటుందని గుర్తు చేశారు. ఈ కారణంగా ఆ ఖాళీ అయిన స్థానానికి మళ్లీ ఉపఎన్నిక నిర్వహించాల్సి వస్తుందన్నారు. ఈ కారణంగా ప్రభుత్వానికి, అంటే ప్రజల సొమ్ముకు అనవసరమైన ఖర్చు అవుతోందని పిటిషనర్ వాదించారు. అందుకే రెండు చోట్ల పోటీ చేసే అభ్యర్థుల నుంచి ఒకవేళ గెలిచి రాజీనామా చేస్తే ఆ ఉపఎన్నిక ఖర్చును తానే భరిస్తాను అన్న హామీ పత్రం తీసుకోవాలని ఆయన కోరారు.
హైకోర్టు తిరస్కరణ
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఏ. ధర్మాధికారి, జస్టిస్ జి. అరుల్ మురుగన్‌తో కూడిన ధర్మాసనం ఈపిటిషన్‌ను మంగళవారం విచారించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం అభ్యర్థులు రెండు స్థానాల నుండి పోటీ చేయడానికి చట్టం స్పష్టంగా అనుమతిస్తోందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. రెండు చోట్ల పోటీ చేయడాన్ని సవాలు చేస్తూ గతంలో దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఇప్పటికే కొట్టివేసిందని గుర్తుచేశారు. ఆ తీర్పును పరిగణనలోకి తీసుకుంటూ హైకోర్టు కూడా ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇలాంటి నిబంధనలను మార్చడం లేదా కొత్తవి తీసుకురావడం అనేది ఈసీ లేదా చట్టసభల పరిధిలోని అంశమని, కోర్టులు ఇందులో జోక్యం చేసుకోలేవని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.


