తిరువళ్లూరు: ఛైత్రమాసం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన సోమవారం ఉదయం స్వామివారు వేణగోపాల నాచ్చీయార్ తిరుక్కోలం అలంకరణలో దర్శనమిచ్చారు. తిరువళ్లూరు పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ వీరరాఘవ స్వామివారి ఆలయం ఉంది. ఆలయంలో ప్రతి ఏటా ఛైత్రమాసం బ్రహ్మోత్సవాలను పది రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే గత 22న ధ్వజారోహణంతో ఉత్సవాలను ప్రారంభించారు. మూడో రోజు గరుడసేవను నిర్వహించారు. ఆరో రోజైన సోమవారం ఉదయం స్వామివారు శ్రీదేవి భూదేవిలతో కలిసి వేణుగోపాల నాచ్చీయార్ తిరుక్కోలం అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఉదయం ఐదు గంటలకు చూర్ణాభిషేకం, ఆరుగంటలకు వెండిసభ్రం, పదిన్నర గంటలకు తిరుమంజనం నిర్వహించారు. రాత్రి ఏడున్నర గంటలకు స్వామివారు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలకు విశేషంగా భక్తులు హాజరయ్యారు.


