మధురై ధర్మాసనం వ్యాఖ్య
నిబంధనలు కఠినతరం
సాక్షి, చైన్నె: విచారణలో ఉన్న విషయంపై వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేయడం అనవసరం అని మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనం వ్యాఖ్యలు చేశారు. విరుదునగర్ బాణసంచా తయారీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో బాధితులకు భారీ పరిహారం అందించాలన్న పిటిషన్‌పై న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. విరుదునగర్‌కు చెందిన విడియల్ వీర పెరుమాళ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 19న శివకాశి సమీపంలో జరిగిన అగ్నిప్రమాద బాధితులకు పరిహారం చెలిచే విఽషయంగా కొన్నిసూచనలు చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షలు, గాయపడ్డ వారికి రూ. 5 నుంచి 15 లక్షల వరకు నష్ట పరిహారం అందించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పరిహారంతో పాటు, బాధితుల కుటుంబాలకు ఉచిత విద్య, పునరావాసం కల్పించాలని , భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా బాణసంచా తయారీ పరిశ్రమలపై సాంకేతిక విచారణ జరిపి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు.
కోర్టు స్పందన – విచారణ వాయిదా
ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ సతీష్ కుమార్, జస్టిస్ జ్యోతి రామన్ ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకే రకమైన డిమాండ్లతో పదేపదే వేర్వేరు పిటిషన్లు దాఖలు చేయడం అనవసరం అని పేర్కొంది. కొన్ని సందర్భాల్లో ప్రజలు దీనిని తమ ప్రచారం కోసం వాడుకునే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నబాణా సంచా తయారీ పరిశ్రమల్లో ప్రమాదాలకు సంబంధించిన ఇతర కేసులతో ఈ పిటిషన్‌ను జత చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 8వ తేదీకి వాయిదా వేసింది.
బాణసంచా తయారీపై ఆంక్షలు
తమిళనాడులో వేడిగాలుల తీవ్రత పెరుగుతున్నందున, బాణసంచా తయారీలో వాడే రసాయనాల వల్ల ప్రమాదాలు జరగకుండా కేంద్ర పేలుడు పదార్థాల నియంత్రణ శాఖ కొత్త నిబంధనలు విధించింది. రసాయనాల మిశ్రమం, ముడి పదార్థాల శుద్ధిని ఉదయం 6 గంటల నుండి 10 గంటల మధ్యే పూర్తి చేయాలని ఆదేశించారు. ఎండ తీవ్రత పెరిగే మధ్యాహ్నం వేళల్లో పనులు చేయడం ప్రమాదకరమని ఈ నిర్ణయం తీసుకున్నారు. భద్రతా నియమాలను ఉల్లంఘించే కర్మాగారాల లైసెన్సులను రద్దు చేయడమే కాకుండా, వాటిని శాశ్వతంగా మూసివేస్తామని అధికారులు హెచ్చరించారు. విరుదునగర్, సాత్తూరు, శివకాశి పరిసరాల్లోని కొన్ని ప్రమాదకర పరిశ్రమలలో ప్రస్తుతానికి ఉత్పత్తిని నిలిపివేశారు.


