వివాహితుడితో ప్రేమాయణం | - | Sakshi
Sakshi News home page

వివాహితుడితో ప్రేమాయణం

Apr 28 2026 8:11 AM | Updated on Apr 28 2026 8:11 AM

వివాహితుడితో ప్రేమాయణం నాటు బాంబు పేలి పశువులకు గాయాలు విరుదనగర్‌ పేలుడు ఘటనలో మరో అరెస్టు

తిరువొత్తియూరు: కన్యాకుమారి జిల్లా ఆరుమనై సమీపంలో నర్సింగ్‌ చదువుతున్న ఒక యువతి, వివాహమై పిల్లలు ఉన్న ఒక వ్యక్తితో కలిసి మెడలో పూలమాలలతో పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని ఆశ్రయం కోరిన సంఘటన సంచలనం కలిగించింది. కన్యాకుమారి జిల్లా అరుమనై సమీపంలోని చిదరల్‌ ప్రాంతానికి చెందిన అస్మి అనే విద్యార్థిని, కొన్ని రోజుల క్రితం కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమె కోసం వెతుకుతుండగా అస్మి సుజిన్‌ అనే వ్యక్తితో కలిసి మెడలో దండలతో పోలీస్‌ స్టేషన్‌లో ప్రత్యక్షమై రక్షణ కోరింది. విచారణలో సుజిన్‌కు ఇదివరకే పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారని, భార్యతో గొడవల కారణంగా విడిగా ఉంటున్నాడని తెలిసింది. దీనిపై సమాచారం అందుకున్న ఆమె తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌కు వచ్చి కుమార్తెను చూసి దిగ్భ్రాంతి చెందారు. సుజిన్‌కు వివాహం అయిందని పోలీసులు హెచ్చరించినప్పటికీ, అస్మి అతనితోనే వెళ్తానని మొండికేసింది. ఇద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు వారిని కలిసి వెళ్లడానికి అనుమతించారు.

తిరువళ్లూరు: అడవి పందులను నివారించడానికి పెట్టిన నాటు బాంబులు పేలడంతో గేదెలు, పశువులు తీవ్రంగా గాయపడడంతో పాడి రైతులు బోరున విలపించారు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్‌ కొట్టయూర్‌లో ఎక్కువ మంది రైతులు వరి తదితర పంటలను సాగు చేస్తున్నారు. ఈ పంటలను రాత్రి సమయంలో అడవి పందులు ధ్వంసం చేస్తున్న క్రమంలో వాటిని నివారించడానికి గడ్డితో కలిపి నాటుబాంబులను రైతులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆదివారం మేతకు వెళ్లిన పశువులు గడ్డిని మేయడానికి యత్నించడంతో నాటుబాంబులు పేలి గేదెలు పశువులకు గాయాలయ్యాయి. నోటి భాగం తీవ్రంగా దెబ్బతింది. గాయపడిన పశువులను చూసి పాడి రైతులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

అన్నానగర్‌: విరుదునగర్‌ సమీపంలోని కట్టనార్‌పట్టిలో ఉన్న వనజ టపాసుల కర్మాగారంలో గత 19 వ తేదీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 25 మంది దుర్మరణం చెందారు. సహాయక చర్యల్లో పాల్గొన్న పోలీసులకు కూడా కాలిన గాయాలవ్వగా, వారు ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఎన్ని కల సమయం కావడంతో సహాయాన్ని వెంటనే ప్రకటించలేదు. దీనికి వ్యతిరేకంగా మరణించిన కార్మికుల కుటుంబాలు నిరసన తెలిపాయి. జిల్లా యంత్రాంగం వారితో చర్చలు జరిపిన అనంతరం, మొదటి విడతగా అధికారులు రూ. 5 లక్షల సహాయాన్ని అందించారు. కాగా ఫ్యాక్టరీ యజమాని ముత్తు మణికం, అతని భార్య ఈశ్వరిపై వచ్చక్కారపట్టి పోలీసులు కేసు నమోదు చేసి వారి కోసం గాలిస్తున్నారు. ఈ పరిస్థితిలో, ముత్తు మణికం కొన్ని రోజుల క్రితం విరుదునగర్‌ కోర్టులో లొంగిపోయాడు. అనంతరం, కోర్టు ఆదేశాల మేరకు అతడిని రిమాండ్‌కు పంపారు. పరారీలో ఉన్న ఈశ్వరిని వచ్చక్కారపట్టి పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆమెను జ్యుడిషియల్‌ కస్టడీకి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement