సాక్షి, చైన్నె: తంజావూరు బృహదీశ్వరాలయంలో చిత్తిరై బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఈ వేడుకలో భాగంగా సోమవారం రథోత్సవం వేలాది మంది భక్తుల సమక్షంలో కోలాహలంగా నిర్వహించారు. వివరాలు.. ప్రపంచ ప్రసిద్ది గాంచిన బృహదీశ్వర ఆలయంలో ఈనెల 13 నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. రోజూ స్వామి వారు భక్తులకు వివిధ వాహన సేవల ద్వారా దర్శనం ఇచ్చారు. ఈ ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం 6.20 గంటలకు జిల్లా కలెక్టర్, ఇతర ప్రముఖులు రథాన్ని లాగి ఉత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రథోత్సవం..
సాధారణంగా 19 అడుగుల ఎత్తు, 40 టన్నుల బరువుండే ఈ రథం, అలంకరణ తర్వాత 50 అడుగుల ఎత్తుకు, 43 టన్నుల బరువుకు చేరుకుంది. భక్తులు ‘ఆరూరా... త్యాగేశా...‘ అనే భక్తి నినాదాలతో తంజావూరు వీధులను మార్మోగించారు. రథంపై త్యాగరాజ స్వామి, కమలాంబాళ్ కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. రథోత్సవం సందర్భంగా తంజావూరు జిల్లాలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు స్థానిక సెలవు ప్రకటించారు. భక్తులు మొక్కులు చెల్లించుకోవడానికి వీలుగా రథం 14 చోట్ల ఆగేలా ఏర్పాట్లు చేశారు. డ్రైనేజీ కాలువలు ఉన్న చోట భక్తులు పడిపోకుండా ఇనుప కంచెలు ఏర్పాటు చేయడం విశేషం. కాగా, తంజావూరు బిడ్ టెంపుల్ రథోత్సవం కొన్ని దశాబ్దాల పాటూ గతంలో జరగలేదు. సుమారు 100 సంవత్సరాల తర్వాత 2015లో మళ్లీ పునఃప్రారంభించారు. అప్పటి నుంచి ఏటా ఈ వేడుకను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.


