రేసులో మరి కొందరు ! | - | Sakshi
Sakshi News home page

రేసులో మరి కొందరు !

Apr 28 2026 8:11 AM | Updated on Apr 28 2026 8:11 AM

● టీఎన్‌సీసీలో అధ్యక్ష మార్పు ఖాయమా..?

సాక్షి, చైన్నె: తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ ప్రస్తుత అధ్యక్షుడు సెల్వపెరుంతొగై మార్పు ఖాయమన్నది స్పష్టమవుతోంది. త్వరలోనే కొత్త అధ్యక్షుడిని నియమించనున్నారన్న సమాచారం చైన్నెలోని టీఎన్‌సీసీ కార్యాలయం సత్యమూర్తి భవన్‌ చర్చకు దారి తీసింది. తన పదవికి రాజీనామా చేయడానికి సెల్వపెరుంతొగై నిర్ణయించినట్టు సమాచారాలు వెలువడ్డ విషయం తెలిసిందే. సెల్వపెరుంతొగై ఈ నిర్ణయం తీసుకోవడానికి ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీలో నెలకొన్న అసంతృప్తి కారణంగా కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్నికల ప్రచార సభలో రాహుల్‌ గాంధీ ప్రసంగాన్ని తప్పుగా అనువదించడం వివాదానికి దారి తీయడం, ఎన్నికల సమయంలో టీఎన్‌సీసీ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాలు, వ్యవహరించిన తీరుపై ఢిల్లీ అధిష్టానం తీవ్రంగా పరిగణించినట్టు ఇప్పటికే సమాచారాలు వెలువడ్డాయి. అధ్యక్ష రేసులో పలువురు

సెల్వ పెరుంతొగైను తప్పించి ఎంపీ మాణిక్యం ఠాకూర్‌కు అవకాశం ఇవ్వవచ్చు అన్న సంకేతాలు తొలుత వెలువడ్డాయి. అయితే గ్రూపురాజకీయాలకు పెట్టింది పేరుగా ఉన్న కాంగ్రెస్‌లో అధ్యక్ష పదవి కోసం పలువురు నేతలు రేసులోకి దిగారు. వీరిలో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయుడు, ఎంపీ కార్తీ చిదంబరం, మహిళ నేత, కరూర్‌ ఎంపీ జ్యోతిమణి, విరుదునగర్‌ ఎంపీ మాణిక్యం ఠాకూర్‌, ప్రస్తుతం పార్టీ శాసనసభా పక్ష నేతగా ఉన్న రాజేష్‌కుమార్‌ పాటు మాజీ అధ్యక్షులు తిరునావుక్కరసర్‌, కె.ఎస్‌. అళగిరి, తంగబాలు కూడా మళ్లీ అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తున్నారన్న సమాచారాలు వెలువడటంతో అధ్యక్ష పదవి హాట్‌ సీటుగా కాంగ్రెస్‌లో మారింది. అయితే, కొత్త వారికే అవకాశం ఇవ్వాలని ఢిల్లీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన ఒకటి రెండు రోజుల్లోనే కొత్త అధ్యక్షుడి ప్రకటన వచ్చే అవకాశం ఉందని టీఎన్‌సీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. పస్తుత అధ్యక్షుడిని మార్చాలనే విషయంలో అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ ధృడంగా ఉన్నట్టు సత్యమూర్తి భవన్‌ వర్గాలు ఽస్పష్టం చేస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement