సాక్షి, చైన్నె : దక్షిణ భారత ఎల్‌పీజీ గ్యాస్ ట్యాంకర్ లారీ ఓనర్స్ అసోసియేషన్ , ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మధ్య నెలకొన్న అద్దె బకాయిల వివాదం గ్యాస్ సరఫరాపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి. ఇందుకు కారణం లారీ ఓనర్స్ అసోసియేషన్ ట్యాంకర్ల సమ్మేకు పిలుపు నివ్వడంతో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఇరాన్ యుద్ధ నేపథ్యంలో గ్యాస్ కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. చిన్న చిన్న దుకాణాలన్నీ ఇప్పటికే మూతపడ్డాయి. ఇంటికి గ్యాస్ సరఫరా సాగుతున్న వర్తక సిలిండర్లు ఎప్పుడు వస్తాయో ఎదురు చూడాల్సిన పరిస్థితి. అదే సమయంలో ఆటోలు, క్యాబ్‌లు గ్యాస్ కోసం బంకుల వద్ద గంటలతరబడి బారులు తీరాల్నిన పరిస్థితి నెలకొంది. ఈసమయంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పరిధిలో నడుస్తున్న సుమారు 1,000 గ్యాస్ ట్యాంకర్లకు సంబంధించి దాదాపు రూ. 50 కోట్ల అద్దె బకాయిలు పెండింగ్‌లో ఉండటం తాజాగా వివాదానికి దారి తీసింది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ బకాయిలు చెల్లించకపోవడంతో, దక్షిణ మండల ఎల్‌పీజీ గ్యాస్ ట్యాంకర్ ట్రక్కు యజమానుల సంఘం సమ్మెకు పిలుపునిచ్చింది. బకాయిలు చెల్లించే వరకు లోడింగ్‌కు సహకరించబోమని యజమానులు స్పష్టం చేశారు. నామక్కల్ కేంద్రంగా పనిచేసే ఈ అసోసియేషన్ ప్రతినిధులు ఇప్పటికే అధికారులకు లేఖ రాశారు.
గ్యాస్ కొరత ఏర్పడే అవకాశం ఉందా?
ట్యాంకర్ల సమ్మె సమాచారం ప్రజల్లో వంటగ్యాస్ కొరత ఏర్పడుతుందనే ఆందోళన మొదలైంది. అయితే దీనిపై ఏబీసీ అధికారులు వివరణ ఇచ్చారు. ట్యాంకర్ యజమానుల సంఘంతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, బకాయి ఉన్న మొత్తాన్ని ఒకటి రెండు రోజుల్లోనే యజమానులకు చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ప్రతి గ్యాస్ ఫిల్లింగ్ ప్లాంట్‌లో కనీసం 4 రోజులకు సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని, ప్రస్తుతానికి వంటగ్యాస్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఐఓసి స్పష్టం చేసింది.


