తమిళసినిమా: చాలా చిత్రాల్లోని పాటలు సంగీత ప్రియులను అలరిస్తుంటాయి. అయితే కొన్ని మాత్రమే వారి హృదయాలను మీటుతాయి. అలా తాజాగా సంగీత ప్రియులను అలరిస్తున్న పాట వెల్లిచుడరే. నటుడు విష్ణువిశాల్, నటి మమితా బైజు జంటగా నటించిన ఇరండు వానం చిత్రంలోనిది ఈ పాట. దీపు నినన్ థామస్ సంగీతాన్ని అందించిన ఈ పాటను మద్రాషీ రాశారు. ఈ చక్కని మెలోడీ పాటకు సంగీతం, సాహిత్యం, స్వరకల్పన ప్రాణం అని యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. ఈ పాట మళ్లీమళ్లీ వినేలా ఉంటుందని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలింస్ పతాకంపై టీజీ త్యాగరాజన్ సమర్పణలో సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. దీనికి రామ్‌కుమార్ కథ, దర్శకత్వం వహిస్తున్నారు. నటుడు విష్ణు విశాల్, దర్శకుడు రామ్‌కుమార్ కాంబోలో ఇంతకు ముందు ముండాసిపట్టి, రాక్షసన్ తదితర విజయవంతమైన చిత్రాలు రూపొందాయి. దీంతో తాజాగా రూపొందిస్తున్న ఇరండు వానం చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. త్వరలోనే చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం వివరాలను, చిత్ర విడుదల వివరాలను వెల్లడించనున్నట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నారు.


