రమణీయం.. నాగేశ్వరుని రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

రమణీయం.. నాగేశ్వరుని రథోత్సవం

Apr 28 2026 7:35 AM | Updated on Apr 28 2026 7:35 AM

పళ్లిపట్టు: పెద్ద నాగపూండి నాగేశ్వరర్‌ ఆలయ ఛైత్రమాస బ్రహ్మోత్సవాల్లో ప్రసిద్ది చెందిన రథోత్సవం సోమవారం ఉదయం కనులవిందుగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథం లాగి మొక్కులు చెల్లించారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామికి అనుసంధానంలోని ఆర్కేపేట యూనియన్‌ పెద్ద నాగపూండిలో ప్రసిద్ధి చెందిన నాగవల్లీ సమేత నాగేశ్వరర్‌ ఆలయంలో ప్రతిఏటా ఛైత్రమాస బ్రహ్మోత్సవాలు వేడుకగా నిర్వహించడం పరిపాటి. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు 21న ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. దీంతో రోజూ స్వామికి అభిషేక పూజలు చేపట్టి ఉత్సవర్లు వాహన సేవల్లో గ్రామ వీధుల్లో ఊరేగారు. భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా 7వ రోజు శనివారం ఉదయం నాగవల్లీ సమేత నాగేశ్వరస్వామి పుష్పాలంకరణలో రథంపై కొలువుదీరారు. గ్రామీణులు పెద్ద ఎత్తున పాల్గొనగా కర్పూర హారతులతో రథాన్ని భక్తులు లాగి గ్రామవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు రథంపై ఉప్పు మిరియాలు వెదజెల్లి తమ మొక్కులు తీర్చుకున్నారు. గ్రామ ప్రధాన వీధుల్లో నాగేశ్వరస్వామి ఊరేగి భక్తులను కటాక్షించారు. తిరుత్తణి ఆలయ జాయింట్‌ కమిషనర్‌ రమణి ఆధ్వర్యంలో రథోత్సవ వేడుకల ఏర్పాట్లు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement