‘సీఎస్‌’పై వేటు! | - | Sakshi
Sakshi News home page

‘సీఎస్‌’పై వేటు!

Apr 9 2026 7:47 AM | Updated on Apr 9 2026 7:47 AM

● ఇంటెలిజెన్స్‌ డీజీపీపై కూడా ● కొత్త సీఎస్‌గా సాయికుమార్‌ ● సీఈసీ నిర్ణయంపై సీఎం ఫైర్‌

సాక్షి, చైన్నె : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందంపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ బదిలీ వేటు వేసింది. ఇంటెలిజెన్స్‌ డీజీపీ డేవిడ్సన్‌ దేవాశీర్వాదంను కూడా మార్చేశారు. మురుగానందం స్థానంలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సాయికుమార్‌ను సీఎస్‌గా నియమించారు. వివరాలు.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బదిలీల పర్వం వేగం పుంజుకున్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం రాష్ట్ర ఇన్‌చార్జ్‌ డీజీపీగా ఉన్న వెంకట్రామన్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్‌ తప్పించింది. ఆయన స్థానంలో డీజీపీగా సందీప్‌ రాయ్‌ రాథోర్‌ నియమితులయ్యారు. టీవీకే విజయ్‌కు ప్రచారం విషయంలో అనుమతుల మంజూరులో జాప్యం వెనుక సచివాలయం నుంచి లాబీయింగ్‌ సాగుతున్నట్టుగా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేరినట్టు సమాచారం. ఈ పరిస్థితులలో డీజీపీ సందీప్‌ రాయ్‌ రాథోర్‌ ఓ ప్రకటన చేశారు. సంబంధం లేని అధికారులు ఆదేశాలను అనుసరించ వద్దని, ప్రొట్రోకాల్‌ ప్రకారం అధికారులు ఇచ్చే ఉత్తర్వులు, ఆదేశాలు, సూచనలను అనుసరించాలని జిల్లా ఎస్పీలు, కమిషనర్లు, ఐజీ, డీఐజీలకు హుకుం జారీ చేశారు. ఈ ప్రకటన వెలువడిన కాసేపటికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందంను తప్పిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.

కాషాయం ముసుగులో సీఈసీ

రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలలో డీజీపీ, ఇతర ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల బదిలీలు జరిగాయి. అయితే, ప్రపథమంగా సీఎస్‌ను మార్చుతూ కేంద్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకోవడం వివాదానికి దారి తీసింది. కేంద్ర ఎన్నికల కమిషన్‌ సైతం కాషాయం రంగు పూసుకున్నట్టు స్పష్టం అవుతోందని సీఎం స్టాలిన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంకేను ఓడించడమే లక్ష్యంగా బిజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నదని, తాజా సుప్రీంకోర్టు ఆదేశాలు, ఉత్తర్వులను ఉల్లంఘించి సైతం సీఎస్‌ను మార్చడం బట్టి చూస్తే, ఎన్నికల కమిషన్‌ కేంద్రం పెద్దల గుప్పెట్లో పావుగా మారి ఉందన్నారు. కేంద్రం దర్బారులో ఒకటిగా మారిన ఎన్నికల కమిషన్‌ ద్వారా తమిళనాడులో అధికార పగ్గాలు చేజిక్కించుకునేందుకు పన్నుతున్న వూహాలన్నింటిని ఓటు అనే ఆయుధంతో ప్రజలే చిన్నా భిన్నం చేస్తారన్నారు.

సీఎస్‌గా సాయికుమార్‌

మురుగానందం స్థానంలో సీనియర్‌ ఐఏఎస్‌ సాయికుమార్‌ను నియమిస్తూ, తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టాలన్న ఆదేశాలు ఢిల్లీ నుంచి రావడం గమనార్హం. 1990 ఐఎఎస్‌ బ్యాచ్‌కు చెందిన సాయికుమార్‌ రెవెన్యూ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తూ వచ్చారు. అదే సమయంలో ఇంటెలిజెన్స్‌ డీజీపీగా ఉన్న డేవిడ్సన్‌ దేవాశీర్వాదంను సైతం తప్పించారు. ఆయన బాధ్యతలను ఎవ్వరికి అప్పగించక పోగా, ఆర్మ్‌డ్‌ పోలీసు, విజిలెన్స్‌ అండ యాంటీ కరెప్షన్‌ విభాగం డీజీపీగా సందీప్‌ మిట్టల్‌ను నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement