సాక్షి,చైన్నె : పీఎంకేలో మామిడి పండు గుర్తు వివాదం ఉత్కంఠ రేపుతోంది. అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరించడంతో పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసుకు టెన్షన్ తప్పడం లేదు. పార్టీలో విబేధాల నేపథ్యంలో పార్టీ చిహ్నం మామిడి పండు’ గుర్తును స్తంభింపజేయాలని కోరుతూ రాందాసు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
ఈ అప్పీల్ పిటిషనన్‌ను అత్యవసరంగా విచారించాలన్న రాందాసు తరపు అభ్యర్థనను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. బుధవారం మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ. ధర్మాధికారి, జస్టిస్ జి. అరుళ్ మురుగన్ ధర్మాసనం ముందు రామదాస్ తరపు న్యాయవాదులు మరోసారి అభ్యర్థన చేశారు. ఈ కేసును మధ్యాహ్నమే అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని కోరారు. అయితే, న్యాయమూర్తులు ఈ అభ్యర్థనను అంగీకరించలేదు. పిటిషన్ ఇంకా నంబరింగ్ ప్రక్రియ పూర్తి కాలేదని, రిజిస్ట్రీ ద్వారా పిటిషన్ నంబర్ కేటాయించే వరకు విచారణకు తీసుకోలేమని స్పష్టం చేశారు. నంబరింగ్ పూర్తయితేనే సాధారణ పద్ధతిలో విచారిస్తామని ఽ హైకోర్టు బెంచ్ స్పష్టం చేయడంతో రాందాసు శిబిరంలో టెన్షన్ పెరిగింది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఈ చిహ్నంను అన్బుమణికి అప్పగించింది. నామినేషన్ల ఉప సంహరణ గడువు గురువారం, అదే రోజు చిహ్నాల కేటాయింపు జరుగుతుంది. అంతలోపు ఈ పిటిషన్ విచారణకు వచ్చేనా అన్న ఎదురు చూపులు పెరిగాయి.


