ఐక్యత లేకుంటే
– అన్నామలై వ్యాఖ్య
సాక్షి, చైన్నె: కేవలం 30 అసెంబ్లీ స్థానాల మధ్యే సరైన సీట్ల సర్దుబాటు చేసుకోలేక, అంతర్గత విభేదాలతో కొట్టుమిట్టాడుతున్న ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రజలకు మంచి పాలన ఎలా అందిస్తుందని బీజేపీ సీనియర్ నేత అన్నామలై ప్రశ్నించారు. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అన్నామలై మంగళవారం పుదుచ్చేరి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈసందర్భంగా పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన, పుదుచ్చేరిలోని కాంగ్రెస్–డీఎంకే(ఇండియా) కూటమిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
వింతైన కూటమి..
ప్రపంచంలో ఎక్కడా లేని వింతైన కూటమి పుదుచ్చేరిలో ఉందన్నారు. ఇక్కడ భాగస్వామ్య పక్షాల మధ్య కనీస గౌరవం లేదని ఎద్దేవా చేశారు. కూటమి ధర్మాన్ని పక్కన పెట్టి, మిత్రపక్షాలు పోటీ చేసే స్థానాల్లో కూడా కాంగ్రెస్ తన అభ్యర్థులను నిలబెట్టిందని, ఇది ఆ కూటమిలో ఉన్న అనైక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. కేవలం 30 నియోజకవర్గాలను కూడా సమర్థవంతంగా పంచుకోలేక విఫలమైన ఈ పార్టీలు, రాష్ట్ర బాధ్యతలను ఎలా చేపడతాయని ఆయన ప్రశ్నించారు. సీట్ల సర్దుబాటు నుంచి నామినేషన్ల దాఖలు వరకు ప్రతి విషయంలోనూ ఇండియా కూటమి విఫలమైందని అన్నామలై విమర్శించారు. ఎన్నికల రోజున ఈ కూటమికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, భారీ ఓటమితో ఇండియా కూటమి తుడిచిపెట్టుకుపోతుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ నేతృత్వంలోని కూటమి మాత్రమే పుదుచ్చేరి అభివృద్ధికి తోడ్పడుతుందని ఆయన స్పష్టం చేశారు.


