విజయ్‌ ప్రచారానికి భద్రత కరువు | - | Sakshi
Sakshi News home page

విజయ్‌ ప్రచారానికి భద్రత కరువు

Apr 1 2026 8:42 AM | Updated on Apr 1 2026 8:42 AM

సీఈసీకి ఫిర్యాదు

డీజీపీకి నోటీసులు

కేసుల నమోదు

సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్‌ ప్రచారంలో చోటుచేసుకున్న పరిణామాలు వివాదానికి దారి తీశాయి. విజయ్‌ ప్రచారంలో భద్రతా లోపాలపై టీవీకే ఆగ్రహం వ్యక్తం చేసింది.

టీవీకే అధినేత విజయ్‌ సోమవారం నామినేషన్‌ దాఖలు చేసిన తర్వాత ప్రచారానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. చైన్నెలోని పెరంబూర్‌, కొలత్తూరు నియోజకవర్గాల్లో విజయ్‌ నిర్వహించిన ప్రచారం భారీ జనసందోహం మధ్య సాగింది. అయితే, ఈ ప్రచారంలో భద్రతా ఏర్పాట్లు సరిగా లేవని, ఇది డీఎంకే ప్రభుత్వ కుట్రని టీవీకే నాయకత్వం ఆరోపించింది. పెరంబూరు, కొళత్తూరు పర్యటన ముగించుకుని విల్లివాక్కంకు విజయ్‌ వెళ్లాల్సి ఉండగా పర్యటన రద్దు కావడం చర్చకు దారి తీసింది. అయితే, విజయ్‌ ప్రచారానికి ఊహించని రీతిలో జనం తరలి రావడమే ఇందుకు కారణంగా తేలింది.

అధవ్‌ అర్జున ఆరోపణలు

టీవీకే ఎన్నికల విభాగం ప్రధాన కార్యదర్శి అధవ్‌ అర్జున మాట్లాడుతూ విజయ్‌ ప్రచారానికి సరైన భద్రత కల్పించకుండా అణచివేయాలని డీఎంకే చూస్తున్నట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నియోజకవర్గమైన కొలత్తూరులో ఒక్క పోలీసు కూడా భద్రత విధుల్లో లేరని ఆరోపించారు. మరో కరూర్‌ ఘటన జరగకుండా ఎన్నికల సంఘం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. విజయ్‌ ప్రచార పర్యటనకు సరైన భద్రత కల్పించడం లేదని ఆరోపిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు టీవీకే నేత నిర్మల్‌కుమార్‌ ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.

డీజీపీకి ఎన్నికల సంఘం నోటీస్‌

విజయ్‌ ప్రచారంలో భద్రతా లోపాలు, జరిగిన తోపులాటపై తమిళనాడు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ అర్చన పట్నాయక్‌ సీరియస్‌ అయ్యారు. ఈ ఘటనపై వివరణ కోరుతూ రాష్ట్ర పోలీస్‌ డీజీపీకి, జిల్లా ఎన్నికల అధికారికి నోటీసులు జారీ చేశారు. అభ్యర్థులందరికీ సమానంగా భద్రతా నియమాలు అమలు చేస్తున్నారా, లేదా అనే దానిపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

విజయ్‌పై కేసు నమోదు

ఇంత కాలం ఎలాంటి కేసులు లేకుండా వచ్చిన విజయ్‌పై ప్రప్రథమంగా 5 సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ప్రచార సమయంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలపై పెరంబూరు పోలీసులు విజయ్‌తో పాటు 5వేల మందిపై కేసు నమోదు చేశారు. అనుమతి లేని సమయాల్లో రోడ్‌షో నిర్వహించడం, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం వంటి కారణాలతో పాటు నిబంధనలను ఉల్లంఘించి లౌడ్‌స్పీకర్లను వాడినట్టుగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement