● అభ్యర్థుల వాహనాలపై ప్రత్యేక దృష్టి ● తొలి రోజున 573 నామినేషన్లు దాఖలు
సాక్షి,చైన్నె: రాష్ట్రంలో రోడ్డు మార్గంలో కాకుండా, చైన్నె నుంచి కన్యాకుమారి వరకు సముద్రతీరంలోనూ నిఘాను కట్టుదిట్టం చేశారు. మైరెన్ పోలీసులు, నిఘా బృందాలు ప్రత్యేకబోట్ల ద్వారా నిఘా పర్యవేక్షణలో నిమగ్నమయ్యాయి. తమిళనాడు శాసనసభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి రోజున సీఎం స్టాలిన్, టీవీకే అధినేత విజయ్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జున, నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ నామినేషన్లు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజున 573 మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయగా, ఇందులో చైన్నె నుంచే 47 మంది ఉన్నారు. రెండో రోజు మంగళవారం సెలవు కావడంతో నామినేషన్లు స్వీరించలేదు. నామినేషన్ దాఖలు చేసిన వారిలో ఆధవ్‌అర్జున ఆస్తి రూ.197 కోట్లుగా ప్రకటించగా, సీమాన్ ఆస్తి రూ.38 లక్షలుగా వెల్లడించారు. అలాగే నిబంధనలు ఉల్లంఘించే విధంగా ఆయనపై కేసు నమోదు చేశారు. అన్నాడీఎంకే అభ్యర్థులు అందరూ ఈనెల 6న నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం నిర్ణయించింది. డీఎంకే కూటమిలో కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ మినహా తక్కిన పార్టీల అభ్యర్థుల జాబితా వెలువడింది. కూటమి పార్టీలంతా బుధవారం నామినేషన్లు దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి.
రంగంలోకి ప్రత్యేక బృందాలు
ఎన్నికల వేడి రాజుకుంటున్న తరుణంలో నగదు, తాయిలాల తరలింపు కట్టడి దిశగా ఇప్పటికే రోడ్డు మార్గంలో విస్తృత తనిఖీలు జరుగుతున్నాయి. రూ.300 కోట్ల నగదు , వస్తువులు సీజ్ చేశారు. 2వేలకు పైగా ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, మరో రెండు వేలకు పైగా సిట్టింగ్ స్క్వాడ్‌లు తనిఖీలు ముమ్మరం చేశాయి. అదే సమయంలో చైన్నె నుంచి కన్యాకుమారి వరకు 15 సముద్ర తీర జిల్లాల ఉన్నాయి. సముద్ర గుండా నగదు, వస్తువులు ఒడ్డుకు చేరుతున్నాయన్న సమాచారంతో ఎన్నికల యంత్రాంగం అలర్ట్ అయింది. దీంతో చైన్నె నుంచి కన్యాకుమారి వరకు సముద్ర మార్గం, తీర గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టింది. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి తనిఖీలు సముద్ర మార్గంలోనూ ముమ్మరం చేశారు.
బదిలీలు
ఎన్నికల వేళ పలువురు ఐపీఎస్‌లకు స్థానచలనం కల్పించారు. ఈమేరకు విరుదునగర్ ఎస్పీగా పనిచేసి వెయిటింగ్‌లిస్టులో ఉన్న డి.కణ్ణన్‌ను గ్రేటర్ చైన్నె పోలీస్ వెల్ఫేర్ ఎస్టేట్ డిప్యూటీ కమిషనర్‌గా, నాగపట్నం ఎప్పీగా పనిచేసి వెయిటింగ్ లిస్టులో ఉన్న కేఎస్ బాలకృష్ణన్‌ను గ్రేటర్ చైన్నె హెడ్ క్వార్టర్స్ డిప్యూటీ కమిషనర్‌గా, కరూర్ ఎస్పీగా పనిచేసి వెయిటింగ్ లిస్టులో ఉన్న కే.జోష్ తంగయ్యను గ్రేటర్ చైన్నె సెక్యూరిటీ డిప్యూటీ కమిషనర్‌గా ఈరోడ్ ఎస్పీగా పనిచేసి వెయింటిగ్ లిస్టులో ఉన్న ఏ.సుజాతను తీవ్ర వాద నిరోధక విభాగం ఎస్పీగా స్థానచలనం కల్పిస్తూ హోంశాఖ కార్యదర్శి ధీరజ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, వెయిటింగ్ లిస్టులో ఉన్న ఐపీఎస్‌లు కె.షణ్ముగంను క్యూబ్రాంచ్ సీఐడీ, చైన్నెకు, ఆర్.రాజారాంను విలిజెన్స్ ఎస్పీగా, జీఎస్ మాధవన్‌ను క్రైంబ్రాంచ్ సీఐడీ, చైన్నె ఎస్పీగా, జీఎస్ అనితను పోలీసు మోడరనైజేషన్ ఎస్పీగా బదిలీ చేశారు.


