విరుదునగర్‌లో రసవత్తరం | - | Sakshi
Sakshi News home page

విరుదునగర్‌లో రసవత్తరం

Apr 1 2026 8:42 AM | Updated on Apr 1 2026 8:42 AM

మాజీ మంత్రులను కాదని

పారిశ్రామికవేత్తకు టికెట్‌

అన్నాడీఎంకేలో అసమ్మతి సెగ

విజయకాంత్‌ వారసుడికి కలసి వస్తున్న అవకాశాలు

సాక్షి, చైన్నె: అసెంబ్లీ ఎన్నికల్లో విరుదునగర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అన్నాడీఎంకేలో గట్టి పోటీ నెలకొంది. అయితే, పార్టీలోని హేమాహేమీలను పక్కనపెట్టి అధిష్టానం శివకాశికి చెందిన పారిశ్రామికవేత్తను అభ్యర్థిగా ప్రకటించడం స్థానిక నేతల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించింది.

పోటాపోటీ

విరుదునగర్‌ స్థానం కోసం మాజీ మంత్రి కె.టి.రాజేంద్ర బాలాజీ, మరో మాజీ మంత్రి మాఫా పాండియరాజన్‌ వర్గాల మధ్య గత కొంతకాలంగా ప్రచ్ఛన్నయుద్ధం నడిచింది. వీరిద్దరూ విడివిడి గ్రూపులుగా పనిచేస్తూ పట్టు కోసం ప్రయత్నించారు. గత ఏడాది విరుదునగర్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో, పాండియరాజాకు శాలువా కప్పిన వ్యక్తిపై రాజేంద్రబాలాజీ దాడి చేయడం అప్పట్లో పార్టీ కార్యకర్తల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇది ఇద్దరు నేతల మధ్య దూరాన్ని మరింత పెంచింది. లోక్‌సభ ఎన్నికల్లో అవకాశం దక్కకపోవడంతో, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో విరుదునగర్‌ నుంచి కచ్చితంగా పోటీ చేయాలని పాండియరాజన్‌ భావించారు. ఇందుకోసం ఆయన విరుదునగర్‌లో సొంత ఇల్లు కట్టుకుని మరీమకాం వేశారు. తనకు టికెట్‌ వస్తుందని ఆయన అనుచరులు గట్టి నమ్మకంతో ఉన్నారు. పాండియరాజాకు అడ్డుకట్ట వేసేందుకు రాజేంద్ర బాలాజీ, జిల్లా పార్టీ అధ్యక్షుడు అడ్వకేట్‌ విజయకుమారన్‌ను తెరపైకి తెచ్చారు. విజయకుమారన్‌ కూడా తనకు టికెట్‌ వస్తుందని ఆశపడ్డారు.

అనూహ్యంగా మారిన అభ్యర్థి

అనూహ్య పరిణామాల మధ్య శివకాశికి చెందిన బాణసంచా వ్యాపారి, ప్రముఖ పారిశ్రామికవేత్త వి.జి. గణేషన్‌ను విరుదునగర్‌ అభ్యర్థిగా అన్నాడీఎంకే అధిష్టానం ప్రకటించింది. పార్టీ కోసం ఎప్పటి నుంచో కష్టపడుతున్న మాజీ మంత్రులు, జిల్లా స్థాయి నేతలను కాదని, ఒక పారిశ్రామికవేత్తకు టికెట్‌ ఇవ్వడంపై మాఫా పాండియరాజన్‌, విజయకుమారన్‌ వర్గీయులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తమకు సీటు దక్కకపోవడానికి రాజేంద్రబాలాజీ కారణం అనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అదే సమయంలో ఈ విరుదునగర్‌ సీటు డీఎంకే కూటమిలో డీఎండీకేకు కేటాయించారు. తనకు రాజకీయంగా మార్గాన్ని చూపించడమే కాదు, ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపిన విజయకాంత్‌ వారసుడు విజయప్రభాకరన్‌ ఇక్కడ పోటీలో ఉండడంతో మాఫా పాండియరాజన్‌ డైలమాలో ఉన్నట్టు తెలిసింది. విజయకాంత్‌ వారసుడ్ని గెలిపించే దిశగా ఆయన మద్దతుదారులు నిర్ణయించినట్టుగా ప్రచారం ఊపందుకోవడంతో అన్నాడీఎంకే అభ్యర్థిలో టెన్షన్‌ తప్పలేదట. దీంతో పాండియరాజన్‌ను బుజ్జగించేందుకు పరుగులు తీసినట్టు విరుదునగర్‌లో చర్చ జోరందుకుంది. లోక్‌సభ ఎన్నికల సమయంలో విజయ ప్రభాకరన్‌కు విరుదునగర్‌లో మరీ ఎక్కువ ఓట్లు రావడం గమనార్హం. తాజాగా అన్నాడీఎంకేలో అసంతృప్తి తనకు కలిసి వస్తుందన్న ఆశాభావంలో వారసుడు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement