సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీపీఎం తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాను ఆపార్టీ అధిష్టానం మంగళవారం ప్రకటించింది. డీఎంకే కూటమిలో సీపీఎంకు ఐదు స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ స్థానాలలో కన్యాకుమారిలోని పద్మనాభపురంను మార్చుకునే దిశగా సాగిన ప్రయత్నాలు విఫలమైనట్టుంది. ఈ దృష్ట్యా, అభ్యర్థుల జాబితా విడుదలలో జాప్యం తప్పలేదు. ఎట్టకేలకు డీఎంకే కేటాయించిన ఐదు స్థానాలకు అభ్యర్థుల ఎంపిక విషయంగా రాష్ట్ర కార్యదర్శి షణ్ముగం, సీనియర్‌నేత బాలకృష్ణన్ సమక్షంలో జరిగిన సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నారు. ఐదు స్థానాలలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.
ఐదుగురు అభ్యర్థులు
పళణి నియోజకవర్గం నుంచి గతంలో దిండిగల్‌లో పోటీ చేసి ఓటమి పాలైన ఎన్ పాండి పోటీ చేస్తారని ప్రకటించారు. గంధర్వకోట్టై నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎం. చిన్నదురైకు మళ్లీ అవకాశం కల్పించారు. పద్మనాభపురం నుంచి పార్టీ నేత ఆర్.చెల్లస్వామి, తిరువొత్తియూర్ నుంచి ఎల్.సుందరరాజన్, కీల్ వేలూరు నుంచి టి.లతకు కేటాయించారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నాగైమాలికి బదులుగా జిల్లా కార్యవర్గ సభ్యురాలుగా ఉన్న లతకు అవకాశం కల్పించారు.
రాందాసు తొలి జాబితా
పీఎంకేలో చీలిక గురించి తెలిసిందే. అన్బుమణి పీఎంకే అన్నాడీఎంకే కూటమిలో ఉండగా, రాందాసు పీఎంకే శశికళ నేతృత్వంలోని పురట్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర కళగంతో కలసి ఈ ఎన్నికలను ఎదుర్కొంటోంది. ఈ కూటమి తరఫున పోటీ చేసే తన అభ్యర్థుల మొదటి విడత జాబితాను రామదాస్ విడుదల చేశారు. సేలం వెస్ట్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అరుల్, వందవాసి నుంచి మురళీశంకర్, కుంభకోణం నుంచి రాష్ట్ర నిర్వాహక కమిటీ సభ్యుడు ఎం.కె. స్టాలిన్, విరుదాచలం నుంచి సురేష్, మైలాడుతురై నుంచి శక్తివేల్ పోటీచేస్తున్నారు.


