కెన్ కరుణాస్‌తో యూత్ చిత్ర యూనిట్
తమిళ సినిమా: కరుణాస్ వారసుడు కెన్ కరుణాస్ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా పరిచయమైన చిత్రం యూత్. అనిష్మా అనిల్‌కుమార్, ప్రియాన్షీ యాదవ్, మీనాక్షి దినేష్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని పర్వతా ఎంటర్‌టెయిన్‌మెంట్ పతాకంపై కరుప్పయ్య సి.రామ్, సులోచనాకుమార్ నిర్మించారు. సురాజ్ వెంజారముడు, దేవదర్శిని, నళిని ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి జీవీ.ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని విక్కీ చాయాగ్రహణం అందించారు. మార్చి 19న తెరపైకి వచ్చిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపడుతున్న సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం చిత్ర యూనిట్ చైన్నెలోని ప్రసాద్‌ల్యాబ్‌లో థ్యాంక్స్ గివింగ్ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో చిత్ర నిర్మాత కరుప్పయ్య సీ రామ్ మాట్లాడుతూ అసిస్టెంట్ డైరెక్టర్ అయిన తాను నిర్మించిన యూత్ చిత్రానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు అన్నారు.ఇక ముందు తాను నిర్మించే చిత్రాల లాభాల్లోనూ కొంత షేర్ అందిస్తానని చెప్పారు. కెన్ కరుణాస్ మాట్లాడుతూ ఫ్రెండ్స్ లేకపోతే ఈ చిత్రం లేదన్నారు. యూత్ చిత్రం హిట్ అవుతుందని భావించాం కానీ ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదన్నారు. తల్లిదండ్రులకు సంతోషం కలిగించాలనే కారణంతోనే ఈ చిత్రం చేశామని, అది పూర్తికావడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రం ప్రదర్శన మరి కొద్ది రోజుల్లో ముగిసిపోతుందని, అయితే ఈ చిత్రం అనుభవాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ఈ చిత్రం తనకు చాలా మంది స్నేహితులను ఇచ్చిందని కెన్ కరుణాస్ ఆనందాన్ని వ్యక్తం చేశారు.


