తమిళసినిమా: పెద్ద హీరో, చిన్న హీరో అన్న తారతమ్యం లేకుండా కథే హీరోగా చిత్రాలు రూపొందుతున్న కాలం ఇది. కంటెంట్ బాగుంటే ఎవరు హీరో అన్నది ప్రేక్షకులు చూడకుండా చిత్రాలు చూడడానికి ఆసక్తి చూపుతున్నారు. అలా తాజాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న నటుడు అరుళ్‌దాస్ హీరోగా అవతారమెత్తారు. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రానికి రీ యూనియన్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. హస్లర్స్ ఎంటర్‌టెయిన్‌మెంట్ పతాకంపై కార్తీక్ జయాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాట్స్ రెక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. జయకుమార్, అనుపమకుమార్, అఖిల్‌సంతోష్, పర్విన్, సుబ్రమణియన్, జెమిని మణి, శివం, సేతుపతి జయచంద్రన్, కరాటే రాజా, సిలుమిషన్ శివ, కుట్టి గోపి, హరీష్, అరుణ్ ఉదయన్, శరత్, క్రిష్ అండ్ అయ్ షీ, పూవైయార్, కాక్కాముట్టైరమేష్ ముఖ్యపాత్రలు పోషించారు. విక్కీ మెక్ చాయాగ్రహణం, రాకీ డీజే సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోందని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రం టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విజయ్‌సేతుపతి తన ఎక్స్ మీడియా ద్వారా యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. చిత్ర పోస్టర్‌ను చూస్తుంటే ఇది యాక్షన్ ఎంటర్‌టెయినర్ కథా చిత్రంగా ఉంటుందని తెలుస్తోంది.


