– ఐఐటీ ఆధ్వర్యంలో సదస్సు
సాక్షి, చైన్నె: భారతదేశాన్ని ల్యాబ్–గ్రోన్ డైమండ్ రంగంలో ప్రపంచ అగ్రగామిగా నిలబెట్టే లక్ష్యంతో ఐఐటీ మద్రాస్‌కు చెందిన ‘ఇండియా సెంటర్ ఫర్ ల్యాబ్ గ్రోన్ డైమండ్’ పరిశోధనా బృందం కీలక అడుగులు వేసింది. క్వాంటం టెక్నాలజీస్, ఫోటోనిక్స్ , సెన్సింగ్ వంటి అత్యాధునిక రంగాలలో భారతీయ పరిశోధనలను ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లేందుకు ఈ బృందం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఇటీవల తొలి అంతర్జాతీయ సదస్సు ఐఐటీ మద్రాసులో నిర్వహించినట్టు వజ్రాల శాస్త్రం, ఎమర్జెంట్ మెటీరియల్స్‌పై చర్చించినట్టు మంగళవారం ప్రకటించారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా, జీజేఈపీీసీ సహకారంతో ఈ కార్యక్రమం జరిగిందని వివరించారు. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ మద్దతుతో స్థాపించిన ఈ కేంద్రం, స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేయడం ద్వారా భారతదేశాన్ని ఆత్మనిర్భర్‌గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సాంకేతికత భారతీయ స్టార్టప్‌లకు, పరిశ్రమలకు అందుబాటులోకి రానుంది. ఈ విషయంగా ప్రొఫెసర్ ఎం.ఎస్. రామచంద్రరావు వివరిస్తూ ల్యాబ్–గ్రోన్ డైమండ్ పరిశ్రమకు అవసరమైన నిపుణులను తయారు చేయడానికి తాము త్వరలో ప్రత్యేక కోర్సులను కూడా ప్రారంభిస్తున్నామన్నారు. వచ్చే ఏడాది ఐసీడీఈఎం– 2027 సదస్సును జనవరి 27 నుంచి 29 వరకు నిర్వహించనున్నామని ప్రకటించారు. ప్రొఫెసర్ సత్యన్ సుబ్బయ్య మాట్లాడుతూ భారతదేశంలోని నవతరం పారిశ్రామికవేత్తలు వజ్రాలను కేవలం ఆభరణాలకే కాకుండా ఇతర సాంకేతిక రంగాల్లో కూడా ఉపయోగిస్తున్నారన్నారు. వారితో కలసి పనిచేయడం ద్వారా భారత్ కొత్త ఎత్తులకు చేరుకుంటుందన్నారు.


